సార్.. న్యాయం చేయండి
యాచారం: ‘సార్ మాకు న్యాయం చేయండి.. ఏళ్లుగా ఆ భూములనే నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నాం.. సర్కార్ నుంచి పైసా పరిహారానికి నోచుకోలేదు.. అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదు.. మీరైనా ఆదుకోండి’ అంటూ కడ్తాల్ మండలం పల్లెచెల్కతండా గిరిజనులు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఫార్మాసిటీకి సేకరించిన భూముల సర్వే, ఫెన్సింగ్ నిర్మాణంలో భాగంగా ఆరోరోజు గురువారం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 184లో పనులు కొనసాగాయి. ఈ సందర్భంగా పల్లెచెల్కతండాకు చెందిన రైతులు పనుల వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. పరిహారం అందే వరకు సర్వే, ఫెన్సింగ్ పనులు నిలిపేయాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యాచారం తహసీల్దార్ అయ్యప్పను అక్కడికి రప్పించి గిరిజనుల గోడు వినిపించారు. కలెక్టర్, టీజీఐఐసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పల్లెచెల్కతండా గిరిజనుల ఆందోళన


