కన్నేసి.. కబ్జాకు యత్నించి!
మొయినాబాద్: రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కబ్జాకోరులు కన్నేసారు. ఆక్రమణకు విఫలయత్నం చేశారు. వరుసగా మూడు రోజులపాటు సెలవులు ఉండటంతో ఇదే అదనుగా ఏకంగా ప్రీకాస్ట్ వాల్ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, సిబ్బందితోపాటు గ్రామస్తులు ఘటనా స్థలానికి వెళ్లి అడ్డుకున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని తోలుకట్ట రెవెన్యూలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తోలుకట్ట రెవెన్యూలోని సర్వేనంబర్ 143లో ఉన్న ప్రభుత్వ భూమిని గతంలో ప్రభుత్వం పేదలకు అసైన్డ్ చేసింది. కొంతమంది రైతులు అప్పట్లో ఇతరులకు విక్రయించినట్లు గుర్తించిన అధికారులు 2000 సంవత్సరంలో పీఓటీ చట్టం కింద వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న విలువైన ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్నుపడింది. 1968లో వేలంపాటలో 5 ఎకరాలు కొన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. ఆరేడేళ్లుగా కబ్జాచేసేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఓసారి ఫెన్సింగ్ వేయడంతో రెవెన్యూ అధికారులు తొలగించారు. కొంత కాలానికి కడీలు పాతడంతో వాటిని సైతం తీసివేశారు. రెండేళ్ల క్రితం ఫ్రీకాస్ట్ వాల్ నిర్మాణం చేపడట్టడంతో కూల్చివేశారు. తాజాగా శనివారం మరోసారి ప్రీకాస్ట్ వాల్ నిర్మాణానికి పూనుకోగా గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆర్‌ఐ రాజేష్, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేయగా కబ్జాదారులు బెదిరింపులకు దిగారు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి భూమికి సంబంధించి ఏమైనా పత్రాలుంటే తేవాలని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.30 కోట్లకు పైనే ఉంటుంది. విషయాన్ని చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ప్రభుత్వ భూమి కబ్జా యత్నంలో పెద్దల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
తహసీల్దార్‌పై కోర్టు ధిక్కరణ కేసు
తోలుకట్టలోని 143 సర్వే నంబర్‌లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేసే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌పై కోర్టు ధిక్కరణ కేసు పెట్టారు. కోర్టును సైతం తప్పుదోవ పట్టించారు. తప్పుడు పత్రాలతో కోర్టు నుంచి స్టే తీసుకుని తహసీల్దార్‌పై కోర్టు ధిక్కరణ కేసు పెట్టారు.
పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. శనివారం సా యంత్రం చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి భీంభరత్, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీసతీష్, పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, మాజీ సర్పంచ్ సత్యనారాయణ తదితరులు అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం
వరుస సెలవుల నేపథ్యంలో ప్రీకాస్ట్ వాల్ నిర్మాణం
అడ్డుకున్న రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు


