అకాల వర్షాలు.. అప్రమత్తత మేలు
● చెట్ల కిందకు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలి ● ఉరుములు, మెరుపులు చూసేందుకు యత్నించొద్దు
షాబాద్: అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై, బలమైన ఈదురుగాలులతో మెరుపులతో కూడిన పెద్ద శబ్ధాలతో పిడుగులు పడతాయి. వీటికి బలమైన అయస్కాంత శక్తితో కూడిన విద్యుత్ శక్తి ఉంటుంది. దీంతో వీటి ప్రభావంతో మనుషులతో పాటు జంతువులు మృత్యువాత పడుతున్నాయి. పిగుడుల ప్రభావానికి పచ్చని చెట్లు సైతం కాలిపోతుంటాయి.
పిడుగు అంటే...?
మేఘాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల వర్షపు నీరు చిన్న మంచు కణాలుగా విడిపోతుంది. ఈదురు గాలులకు వాటి మధ్య రాపిడి జరిగి, ఇందులోని పాజిటివ్ కణాలు తేలికగా ఉండటం వల్ల మేఘాల పైకి వెళ్తుంటే, నెగెటివ్ కణాలు బరువుగా ఉండి కిందికి వెళ్తుంటాయి. ఈ క్రమంలో పాజిటివ్, నెగెటివ్ కణాలు ఆకర్షించుకొని మెరుపులు వస్తాయి. ఈ సమయంలో మేఘంలోని నెగిటివ్ కణాలు, భూమిలోని పాజిటివ్ కణాలను ఆకర్షిస్తుంటాయి. అప్పుడు భూమిపై ఎత్తుగా ఉండే చెట్లు, గుట్టలు, మనుషులపై పిడుగు పడుతుంది.
బయటకు వెళ్లొద్దు
వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం. వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు, రైతు కూలీలు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కిందకు, విద్యుత్ టవర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలోకి వెళ్లొద్దు. పిడుగుపడే సమయంలో ఆకాశంలోని మెరుపులు అత్యధిక శక్తిని కలిగి ఉంటాయి. ఆ వెలుతురును చూసేందుకు ప్రయత్నించొవద్దు. పిడుగుకు కొన్ని మిలియన్ మెగావాట్ల శక్తి ఉంటుందనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
సమయస్ఫూర్తి అవసరం
వ్యవసాయ పనులు చేసేటప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుంటే పిడుగులు పడతాయని భావించి, రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. వీలు కాకపోతే సమయస్ఫూర్తితో వ్యవహరించి, మోకాళ్లపై చేతులు, తలపెట్టి, దగ్గరగా ముడుచుకొని కూర్చోవాలి. దీంతో సమీపంలో పిడుగు పడినా అందులోని విద్యుత్ ప్రభావం తక్కువగా ఉండి, బతికేందుకు అవకాశాలు ఉంటాయి. పిడుగు పడుతుందని అనిపించినప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకోవడం మంచిది. ఒకవేళ వేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు కాలును భూమి మీద పూర్తిగా ఆనించొద్దు. కాలి వేళ్ల మీద ఉండేందుకు ప్రయత్నించాలి.
విద్యుత్ పరికరాలకు నష్టం
పిడుగు పడినప్పుడు విద్యుత్ పరికరాలకు ఎక్కువ నష్టం వాటిల్లితుంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలి. టీవీ, రిఫ్రిజిరేటర్, సెల్‌ఫోన్ వంటి వాటిని వినియోగించకపోవడం ఉత్తమం. మెరుపులు వస్తున్నప్పుడు ఆరుబయట స్నానం చేయడం, వంట పాత్రలు కడగడం చేయవద్దు. లోహపు వస్తువుల ద్వారా విద్యుత్ ప్రవహించే అవకాశాలు ఎక్కువ.


