ఇదేం ప‘రేషన్’!
జిల్లాలో 23 వేలకుపైగా కొత్త కార్డులు జారీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆహార భద్రత కార్డుపై ఒకరికి ఆరు కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుపై ఒకరికి పది కేజీల చొప్పున, అంత్యోదయ కార్డుపై ఒకరికి 35 కిలోల చొప్పున ప్రభుత్వం బియ్యం ఉచితంగా సరఫరా చేస్తోంది. అంత్యోదయ కార్డుపై చక్కెర కిలో రూ.13.50కి ఇస్తోంది. ఇక గోధుమలు జీహెచ్‌ఎంసీ ఏరియాలో రూ.7 చొప్పున ఐదు కేజీలు, కార్పొరేషన్ పరిధిలో రెండు కేజీలు, మున్సిపాలిటీ సహా గ్రామీణ ప్రాంతాల్లో కేజీ చొప్పున సరఫరా చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 5,58,664 రేషన్‌కార్డులు ఉండగా, వీటి పరిధిలో 18,25,128 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 11,631.810 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని అంచనా వేసింది. ప్రజాపాలన, కులగణనలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు మంజూరు చేసింది. కొత్తగా 23 వేల మందికి కార్డులు జారీ చేసింది. నెలవారీ కోటా విడుదల చేయకపోవడం, ఈకేవైసీ కాకపోవడంతో లబ్ధిదారులకు నిత్యావసరాలు అందడం లేదు. ప్రస్తుతం చౌకధరల దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తుండటంతో కార్డులు పొందిన ఆయా లబ్ధిదారులకు నిరాశ తప్పడం లేదు. ఈ విషయంపై డీలర్లకు కూడా క్లారిటీ లేకపోవడంతో వచ్చిన వారికి ఏం చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
కార్డుల్లో కనిపించనిలబ్ధిదారుల పేర్లు సన్నబియ్యానికి నోచుకోని వైనం రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు తలలు పట్టుకుంటున్న డీలర్లు
జిల్లాలో ఇదీ లెక్క..
రేషన్ కార్డులు అర్బన్ రూరల్
అంత్యోదయ 4,899 29,839
ఆహార భద్రత 2,03,505 3,20,381
అన్నపూర్ణ 01 39
రేషన్‌షాపులు 218 701
మొత్తం కార్డులు 2,08,405 3,50,259
మొత్తం యూనిట్లు 6,84,902 11,40,120
కేటాయించిన బియ్యం 4,221.145 (మె.ట) 7,410.665 (మె.ట)
లబ్ధిదారులందరికీ సరఫరా చేస్తున్నాం
అర్హులైన లబ్ధిదారులందరికీ సన్న బియ్యం సరఫరా చేశాం. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున అక్కడి లబ్ధిదారులు చాలామంది జిల్లా పరిధిలోని రేషన్ షాపుల్లో బియ్యం తీసుకున్నారు. పోర్టబులిటీ ఎక్కువగా నమోదైంది. జిల్లా కోటాకు మించి దుకాణాలకు సరఫరా చేశాం. డీలర్లు రెండు పూటలా బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొత్త కార్డుదారులకు బియ్యం సరఫరా చేయలేదనే ఆరోపణల్లో వాస్తవం లేదు. కార్డులు జారీ చేసిన వారందరికీ కోటా మంజూరు చేశాం.
– పి.శ్రీనివాస్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి
చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు చంటి శాంతి. కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ. భర్త ఇటీవలే మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ప్రజాపాలనలో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. ఇటీవల ప్రభుత్వం రేషన్ కార్డు (నంబర్ 365371648123) మంజూరు చేసింది. అయితే కార్డులో ఆమె పేరు కన్పించలేదు. కేవలం ఇద్దరు పిల్లల పేరుతోనే కార్డు జారీ చేశారు. ఈపాస్ మిషన్ పిల్లల వేలిముద్ర తీసుకోవడం లేదు. దీంతో ఆ కుటుంబం సన్న బియ్యానికి నోచుకోలేకపోయింది.
చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు సిలువేరు లావణ్య. ఇటీవలే భర్త మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కవలపిల్లలు. ప్రజాపాలనలో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం ఇటీవల మూడేళ్ల కుమారుడు సాయికృష్ణ పేరుతో కార్డు (నంబర్ 365371632786) మంజూరు చేసింది. కార్డులో తల్లితో సహా మరో పిల్లాడి పేరు కన్పించలేదు. దీంతో ఇప్పటి వరకు ఆ కార్డుకునిత్యావసరాల కోటా కేటాయించ లేదు. వీరే కాదు కొత్తగా రేషన్‌కార్డులు పొంది ప్రభుత్వంసరఫరా చేసే సన్న బియ్యం కోసం రేషన్ షాపుల వద్దకు వెళ్తున్న అనేక మందికి ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.
ఇదేం ప‘రేషన్’!
ఇదేం ప‘రేషన్’!


