హామీల అమలులో ప్రభుత్వం విఫలం
బడంగ్‌పేట్: బాధ్యత గల ప్రభుత్వం భద్రతను గాలికొదిలేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. బడంగ్‌పేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం బీఆర్‌ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు పర్యాయాలు రైతుభరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం రుణమాఫీ చేశా మని గొప్పలు చెప్పుకొంటోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని చిత్తశుద్ధితో అమలు చేయడం లేదన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించతలపెట్టిన బీఆర్‌ఎస్ బహిరంగసభకు పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కందుకూరు మండల అధ్యక్షుడు జయేందర్, మహేశ్వరం మండల అధ్యక్షుడు రాజునాయక్, తుక్కుగూడ కార్పొరేషన్ అధ్యక్షుడు లక్ష్మయ్య పాల్గొన్నారు.


