కుటుంబ కలహాలతో పురుగు మందు తాగిన వ్యక్తి
చిక్సిత పొందుతూ మృతి
కేశంపేట: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని దత్తాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అయ్యవారి వేణు(32) డ్రైవర్‌గా పని చేస్తు భార్య లత, ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తున్నాడు. వేణు ప్రేమ వివాహం చేసుకొని కొద్దికాలం సంతోషంగా ఉన్నాడు. తదనాంతరం కుటుంబ విషయంలో అప్పుడప్పుడు భార్యాభర్తలు గొడవలు పడేవారు. ఇలా తగాదా జరిగినప్పుడు లత కొన్ని రోజులు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి మళ్లీ వచ్చేదని గ్రామస్తులు తెలిపారు. ఆమె ఇలా చేస్తుండటంతో వేణు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మనోవేదనతో ఆయన మంగళవారం రాత్రి పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్ల సూచన మేరకు ఉస్మానియాకి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఆయన మృతి చెందారు. మృతుడి తండ్రి నర్సింహాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరహరి తెలిపారు.
రోడ్డుపై ఆక్రమణల తొలగింపు
చేవెళ్ల: మున్సిపాలిటీ కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆక్రమిత కట్టడాలను తొలగించాలని టౌన్‌ప్లానింగ్ అధికారి మణిహారిక, ట్రాఫిక్ సీఐ వెంకటేశంలు హెచ్చరించారు. బుధవారం చేవెళ్లలో ప్రధాన రహదారిపై దుకాణాల ముందు ఆక్రమించిన స్థలాలను తొలగించే పనులు చేపట్టారు. ఇందులో భాగంగా బోర్డులు, కట్టడాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో తొలగించింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రోడ్డుపై ఆక్రమణలతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పాడుతున్నాయని చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు కూడా రోడ్లపై పార్క్ చేయవద్దని సూచించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రోడ్లు విస్తరణ అవసరమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాఘవేందర్, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
పరువు నష్టం కేసు వాయిదా
సిటీ కోర్టులు : తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ బుధవారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్)లో జరిగింది. ఈ విచారణకు పిటిషనర్ నాగార్జునతోపాటు ప్రతివాది మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడంతో వారి తరుఫున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. సినీ అగ్రహీరో నాగార్జున కుమారుడు హీరో నాగచైతన్య–సమంత విడాకుల విషయంపై వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదైన విషయం విదితమే.
కుటుంబ కలహాలతో పురుగు మందు తాగిన వ్యక్తి


