టీచర్ పర్స్ పోయిందని..
విద్యార్థిని పరీక్ష రాయనీయని వైనం
కొందుర్గు: పాఠశాలలో ఉపాధ్యాయురాలి పర్స్ పోయిందనే నెపంతో.. ఓ విద్యార్థిని వార్షిక పరీక్ష రాయకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన కొందుర్గు గురుకుల పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. పాఠశాలలో గ్రంథాలయ బాధ్యతలు చూసుకునే ఉపాధ్యాయురాలు స్వాతి పర్స్ మిస్ అయ్యింది. అందులో ట్యాబ్‌లెట్లతో పాటు ఏటీఎం కార్డు, రూ.100 ఉన్నాయని స్వాతి తెలిపారు. అయితే ఈ పర్స్‌ను 9వ తరగతికి చెందిన ఓ విద్యార్థి తీసుకున్నాడనే అనుమానంతో గురువారం ఉదయం జరిగిన వార్షిక పరీక్షను క్లాస్ టీచర్ రాయనీయలేదు. అంతేకాకుండా పర్స్ తీసుకొచ్చాక పరీక్ష రాయాలని ఆదేశించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రిన్సిపల్ కుర్షీద్ సదరు విద్యార్థిని తన ఎదుట కూర్చోబెట్టుకుని పరీక్ష రాయించారు. టీచర్ పర్స్ మాత్రం ఎక్కడా దొరకకపోవడం గమనార్హం.


