పోక్సో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగారం
రూ.30 వేల జరిమానా
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రేమపేరుతో బాలికను మోసం చేసి, వివాహం చేసుకోవడంతో పాటు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిందని ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఎంపీపటేల్‌గూడకు చెందిన జంగం నరేందర్ (20) మేసీ్త్ర పని చేస్తుండేవాడు. ఇదే గ్రామంలోని ఓ ఇంట్లో పనులు చేస్తుండగా.. బాలిక పరిచమైంది. ప్రేమ పేరుతో ఆమెను అపహరించి, పెళ్లి చేసుకోవడంతో పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై 2018లో ఆదిబట్ల పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో పోక్సో చట్టం ప్రకారం నరేందర్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఎల్‌బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. నరేందర్‌కు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. బాధితురాలికి రూ.40 లక్షల పరిహారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సునీత, రఘు వాదనలు వినిపించినట్లు సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు.
బీజేపీ పరువునష్టం
కేసు వాయిదా
● గైర్హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
● విచారణను ఈనెల 24కు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
సిటీ కోర్టులు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి గైర్హాజరు కావడంతో న్యాయస్థానం విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు ఫిర్యాదుదారుడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కూడా గైర్హాజరయ్యారు. ప్రతివాది అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ కార్యకలాపాల నేపథ్యంలో కోర్టుకు రాలేకపోయారని ఆయన తరుఫు న్యాయవాదులు విశ్వేశ్వర్‌రావు కోర్టుకు సూచిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.


