అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
చేవెళ్ల: రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో గురువారం నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇళ్లు పంపిణీ చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. పార్టీలకు అతీతంగా ఎంపిక చేయాలన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడుతాయని చెప్పారు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కమిటీ సూచించిన జాబితా ప్రకారం ఇళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించి 3700ల ఇళ్లు మంజూరయ్యాయని, ఒక్కో మండలానికి 700లకు పైగా ఇళ్లు అందుతాయన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసుదన్‌రెడ్డి, ఆర్డీఓ చంద్రకళ, ఐదు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు, ఇందిరమ్మ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య


