
రసాభాసగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కందుకూరు: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ రసా భాసగా మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాటకు దారితీసింది. మండల పరిషత్ సమావేశ హాల్‌లో గురువారం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీ నెరవేర్చాలని, అప్పటి వరకు లబ్ధిదారులు బాకీగానే భావించాలని అన్నారు. అంతలోనే కేసీఆర్ హయాంలో దళితు లకు ఇస్తామని చెప్పిన మూడెకరాల భూమి ఎందుకివ్వలేదని మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేందర్ ప్రశ్నించారు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ క్రమంలో తోపులాట, గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే సబితారెడ్డి జోక్యం చేసుకుని అందరినీ శాంతింపజేసి బయటికి పంపించారు. అనంతరం చెక్కుల పంపిణీ పూర్తి చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, ఎంపీడీఓ సరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్, డైరెక్టర్లు పి.పాండు, యుగంధర్‌గౌడ్, సురేందర్, ఆనంద్, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రశాంత్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట
సర్దిచెప్పి లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సబితారెడ్డి