
ప్రాణం తీసిన విద్యుత్ తీగలు
కొందుర్గు: విద్యుత్ తీగలు ఓ యువకుడి పాలిట యమపాశాలయ్యాయి. పొలంలో తెగిపడిన తీగలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన మండలంలోని చిన్నఎల్కిచర్ల శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం మొదళ్లగూడ గ్రామానికి చెందిన చింతకుంట లక్ష్మమ్మ, రవీందర్ రెడ్డి దంపతులు వ్యవసాయంతోపాటు ఆవుల వ్యాపారం నిర్వహిస్తారు. 15 ఏళ్ల క్రితం కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. చిన్నఎల్కిచర్ల శివారులో అఖిల్ రెడ్డి అనే వ్యక్తి పొలాన్ని కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం గాలివానకు పొలం పక్కనే ఓ విద్యుత్ స్తంభం విరిగి తీగలు తెగిపడ్డాయి. గురువారం రవీందర్ రెడ్డి కుమారుడు అశోక్ రెడ్డి (35) పొరపాటున అటు వైపు వెళ్లడంతో తీగలు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య అక్షయ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన..
మూడు రోజుల క్రితం స్తంభం విరిగిపోయి తీగలు తెగిపడినా మరమ్మతులు చేయకపోవడంతోనే నిండు ప్రాణం పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి అశోక్ రెడ్డి మృతదేహాన్ని చిన్నఎల్కిచర్ల సబ్‌స్టేషన్ ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం తోనే అశోక్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు మృతుడి భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బాలస్వామి, షాద్‌నగర్ రూరల్ సీఐ నర్సయ్య, ఏసీపీ రంగస్వామి అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను సముదాయించినా ఫలితం దక్కలేదు.
సాయం ప్రకటనతో ఆందోళన విరమణ
గాలివానకు చాలా గ్రామాల్లో కరెంటు స్తంభాలు విరిగిపోయాయని అన్నీ సరిచేసుకుంటూ వస్తున్నామని ఏఈ రవికుమార్ తెలిపారు. తీగలు తెగిన చోట సరఫరా నిలిపివేశామని, తీగలపై చెట్లు విరిగిపడటంతో ఎక్కడో మరో లైన్ తీగలు తగలి ఉంటాయని పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి రూ.5లక్షల వరకు ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని, స్వతహాగా తాము మరో రూ.5లక్షలు ఇస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ
సబ్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా

ప్రాణం తీసిన విద్యుత్ తీగలు