లోపాలను సరిచేసేందుకే ‘భూ భారతి’
చేవెళ్ల: ధరణి లోపాలను సరిచేసి, రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుతవం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపల్ పరిధి మల్కాపూర్ సమీపంలోని ఓ కన్వెన్షన్‌లో శనివారం భూభారతిపై చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్‌తో ఏర్పడిన అనేక సమస్యలను సవరించే వీలుకూడా లేకపోవడంతో పదేళ్లుగా రైతులు అనేక కష్టాలు పడ్డారని తెలిపారు. భూ భారతి చట్టంతో రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. భవిష్యత్తులో సమస్యలు అనేవి రాకుండా కొత్త చట్టంలో అనేక అంశాలను పొందుపరిచినట్లు చెప్పారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. భూ భారతతిలో అధికార వికేంద్రీకరణతో మండల, డివిజన్ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు. చట్టంపై పూర్తిగా అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు సభ్యుడు సత్యనారాయణరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, నియోజకవర్గ నాయకుడు వసంతం, మార్కెట్ కమిటీ, పీఏసీఎస్ చైర్మన్‌లు పెంటయ్యగౌడ్, సురేందర్‌రెడ్డి, డీవీఆర్, ప్రతాప్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, చంద్రశేఖర్, తహసీల్దార్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎన్నో సమస్యలకు పరిష్కారం
శంకర్‌పల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన భూ భారతి చట్టం ఎన్నో భూ సమస్యలకు పరిష్కారం చూపబోతోందని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ శివారులోని ఓ ప్రైవేటు గార్డెన్స్‌లో శనివారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ సురేందర్, మున్సిపల్ కమిషనర్ యోగేశ్, మండల ప్రత్యేకాధికారి సురేశ్‌బాబు, ఎంపీడీఓ వెంకయ్య పాల్గొన్నారు.
మండలి చీఫ్‌విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి


