సర్కారు బడుల్లో సౌకర్యాల సర్వే
కేశంపేట: సర్కారు బడుల్లో సౌకర్యాల కల్పనకు చేపట్టిన సర్వే జిల్లాలో కొనసాగుతోంది. ఈ నెల 15న ప్రారంభమైన సర్వే 21వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యూడైస్ ప్లస్ (డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్)లో నమోదు చేస్తారు. ఈ సమాచారంతోనే పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు కావాల్సిన ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయిస్తుంది. యూడైస్ ప్లస్‌లో ప్రధానోపాధ్యాయులు ఇస్తున్న సమాచారంపై వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా యూడైస్ ప్లస్‌లో ఇచ్చిన సమాచారంపై విద్యాశాఖ థర్డ్‌పార్టీతో సర్వే నిర్వహిస్తోంది.
సర్వేలో డైట్ కళశాల విద్యార్థులు
జిల్లాలోని 27 మండలాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు కేజీబీవీ, గురుకుల, మోడల్ పాఠశాలలు కలిపి మొత్తం 1,244 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో యూడైస్ ప్లస్‌పై సర్వే నిర్వహించేందుకు వికారాబాద్‌లోని డైట్ కళాశాల విద్యార్థులతో పాటు ఇబ్రహీంపట్నం సమీపంలోని ప్రజ్ఞ డైట్ కళాశాల విద్యార్థులు 96 మంది సర్వేలో పాల్గొంటున్నారు. ఒక్కో విద్యార్థికి పది పాఠశాలల చొప్పున్న జిల్లా కార్యాలయం నుంచి లిస్టు అందిస్తున్నారు.
యూడైస్‌లో హెచ్‌ఎంల నమోదు..
యూడైస్ ప్లస్‌లో టాయిలెట్స్ వివరాలు, శిథిలావస్థకు చేరిన భవనాలు, మధ్యాహ్న భోజన వివరాలు, విద్యార్థుల ఆధార్ అనుసంధానం, స్కూల్ యూనిఫాంల పంపిణీ, పాఠ్యాపుస్తకాల పంపిణీ లాంటి వివరాలను ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే పాఠశాల ఆవరణలో క్రీడాస్థలం ఉందా లేదా, తరగతి గదుల సంఖ్య, ల్యాబ్, ఫర్నిచర్ వివరాలు సైతం ఇప్పటికే నమోదు చేశారు. ప్రధానోపాధ్యాయులు యూడైస్ ప్లస్‌లో నమోదు చేసిన వివరాలపై ప్రస్తుతం సర్వే కొనసాగుతోంది.
సర్వే చేస్తున్న విద్యార్థులు
విద్యార్థులు లిస్టు ప్రకారం తమకు కేటాయించిన పాఠశాలల్లో సర్వే చేసి వివరాలు నమోదు చేస్తున్నారు. లిస్టును రెండు కాపీలు చేసి ఒకటి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి, మరొకటి డైట్ కళాశాలలో అందించనున్నారు. ఈ 21లోగా సర్వే పూర్తి చేసి వివరాలు డైట్ కళాశాలలో అందించాల్సి ఉంటుంది. డైట్ కళాశాలలో అందించిన లిస్టును కళాశాల సిబ్బంది ఈ నెల 22న డీఈఓ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది.
ఇప్పటికే యూడైస్‌ప్లస్‌లో వివరాలు నమోదు చేసిన ప్రధానోపాధ్యాయులు
వాస్తవాలపై థర్డ్‌పార్టీతో విద్యాశాఖ సర్వే
జిల్లాలో 1,244 ప్రభుత్వ పాఠశాలలు
సర్వేలో పాలుపంచుకుంటున్న 96 మంది విద్యార్థులు
ఈనెల 21వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం
సర్వేకు సహకరిస్తున్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా అధికారుల సూచనలతో యూడైస్ ప్లస్‌లో ఇచ్చి న వివరాలపై సర్వే కొనసాగుతోంది. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన లిస్టు ప్రకారం ఆయా పాఠశాలలకు వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఇస్తూ సర్వేకు సహకరిస్తున్నాం.
– మఠం చంద్రశేఖర్, ఎంఈఓ, కేశంపేట
సర్కారు బడుల్లో సౌకర్యాల సర్వే


