జాబ్ ఫ్రాడ్ కేసులో కేటుగాడి అరెస్ట్
సాక్షి, సిటీబ్యూరో: జాబ్ పోర్టల్స్, సోషల్ మీడియా, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా నిరుద్యోగులను సంప్రదించి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న సైబర్ నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన యువతి ఇండీడ్ జాబ్ పోర్టల్‌లో ఉద్యోగానికి రిజిస్టర్ చేసుకుంది. అనంతరం ఆమెకు +91 9318498011, +91 9821176350 నంబర్ల నుంచి సైబర్ నిందితుడు ఫోన్ చేశాడు. తనను రాజత్ అని పరిచయం చేసుకున్న కేటుగాడు.. ఆరు కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని బాధితురాలిని నమ్మించాడు. ఏదైనా కంపెనీని ఎంచుకోవాలని సూచించి, రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 3 వేలు చెల్లించాలని కోరాడు. రుసుము చెల్లించింన అనంతరం బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం మరో రూ.10,999 మొత్తాన్ని కోరాడు. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందనీ, నియామక ప్రక్రియ మొదలైన తర్వాత చెల్లించిన మొత్తం తిరిగి ఇస్తామని నమ్మించాడు. మెడికల్ ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని సూచించాడు. మొత్తం బాధితురాలి నుంచి రూ. 1.49 లక్షలు వసూలు చేశాడు. అనంతరం నకిలీ జాబ్ కన్పర్మేషన్ లెటర్లు పంపించారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.


