ఎన్నికల వరకే రాజకీయం
మంచాల: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంచాల మండలంలోని ఆగాపల్లి, కాగజ్‌ఘట్, జాపాల, అస్మత్‌పూర్ గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ తదితర పనులను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని ఆగాపల్లి– నోముల రోడ్డును రూ.4 కోట్లతో బీటీగా మార్చామన్నారు. ఈ రహదారితో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. మైనార్టీలకు కమ్యూనిటీ హాల్ కోసం రూ.11 లక్షలు, మరో రూ.10 లక్షలతో అండర్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టామన్నారు. కాగజ్‌ఘట్‌లో రూ.6 లక్షలతో కబ్రస్తాన్ చుట్టూ ప్రహరీ నిర్మించామని, మరో రూ.10 లక్షలతో అండర్ డ్రైనేజీ నిర్మించామని, జాపాలలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులు చేపట్టామని తెలిపారు. అస్మత్‌పూర్‌లో రూ.10 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులు, మరో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేశామని స్పష్టంచేశారు. మండలంలోని 33 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.13 లక్షలు అందజేశామని వెల్లడించారు. భవిష్యత్‌లో కూడా ప్రజల కోసమే పని చేస్తామని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలని, అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ముందుకు సాగుతుందని వెల్లడించారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ఎజెండా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, డైరెక్టర్లు ఎల్లేశ్, పాండు, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, ఎంపీడీఓ బాలశంకర్, తహసీల్దార్ ఎంవీ ప్రసాద్, పీఆర్ డీఈఈ అబ్బాస్, కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, రాంరెడ్డి, నరేందర్‌రెడ్డి, వాజిద్, పీఏసీఎస్ డైరెక్టర్లు వెంకటేశ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పోరాటం గొప్పది..
దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ చేసిన పోరాటం ఎంతో గొప్పదని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు ఆగాపల్లి, కాగజ్‌ఘట్, అస్మత్‌పూర్ గ్రామాల్లో శనివారం జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భూపతిగళ్ల మహిపాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో అందరితో కలిసి నడుస్తాం
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం


