పాత కక్షలతో యువకుడి దారుణ హత్య
చైతన్యపురి: పాత కక్షలతో ఓ యువకు డిని కత్తితో పొడిచి దారుణంగా చంపేసిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు.. ఓల్డ్ నాగోల్ విలేజ్‌కు చెందిన వంగ మనోజ్ (21) శనివారం అర్ధరాత్రి సమయంలో స్నేహితుడు బందెల వంశీతో కలిసి నాగోల్ ఫ్లైఓవర్ సమీపంలోని ఓ రెస్టారెంట్ ముందు బైక్‌పై కూర్చుని టిఫిన్ చేస్తున్నాడు. అదే సమయంలో నాగోలు జైపురి కాలనీకి చెందిన సంజయ్ ముగ్గురు స్నేహితులతో కలిసి బైక్‌పై వచ్చి మనోజ్ మెడను గట్టిగా పట్టుకుని వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడిచాడు. కింద పడిపోయిన మనోజ్‌ను మరో వ్యక్తి పట్టుకోగా పైన కూర్చుని చాకుతో గొంతుకోశాడు. అతని స్నేహితుడు వంశీ అడ్డుకోవటానికి ప్రయత్నించగా అతనిపైనా కత్తితో దాడి చేయటంతో గాయాలయ్యాయి. మనోజ్ రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.
రాజీ కుదుర్చుకున్నా..
మనోజ్, సంజయ్‌లు గతంలో స్నేహితులు. ఈ నేపథ్యంలోనే పోయిన ఏడాది ఏప్రిల్ నెలలో వీరి మధ్య గొడవ జరిగింది. సంజయ్‌పై కత్తితో దాడి చేయగా అప్పట్లో మనోజ్‌పై ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం కొన్ని రోజుల తర్వాత పెద్దల సమక్షంలో ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. అయినా సంజయ్ పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న మనోజ్‌ను హతమార్చినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. మృతుడి సోదరుడు మధు పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


