స్తంభాలు ఒరిగి
చెట్లు కూలి..
కడ్తాల్: మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని మైసిగండి, గోవిందాయిపల్లితండా, గోవిందాయిపల్లి, ఎక్వాయిపల్లి, మర్రిపల్లి, కర్కల్‌పహాడ్, వంపూగూడ, చల్లంపల్లి, మక్తమాధారం తదితర గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై టోల్‌గేట్ సమీపంలో, మైసిగండి ఆలయ సమీపంలో చెట్లు కూలిపోవడంతో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎన్‌హెచ్‌ఏ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై పడిన వృక్షాలను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. భారీ వర్షానికి మైసిగండి ఆలయం పరిసరాల్లో భారీగా వర్షం నీరు చేరడంతో బురదమయంగా మారింది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. కర్కల్‌పహాడ్‌లో వ్యవసాయ పొల్లాలో పలు విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.. గాలివానకు కడ్తాల్, తలకొండపల్లి, యాచారం మండలాల్లోని ఆయా గ్రామాల్లో చెట్లు నేల కూలాయి.. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి, తీగలు తెగిపడ్డాయి.. మామిడి, వివిధ కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలివాన
రహదారులపై నేలకూలిన వృక్షాలు
పడిపోయిన విద్యుత్ స్తంభాలు
గాలికి ఎగిరిపోయిన పైకప్పులు
దెబ్బతిన్న ఆయా పంటలు
ఎగిరిపోయిన ఇళ్ల రేకులు
యాచారం: మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి తాడిపర్తి, కుర్మిద్ద, మల్కీజ్‌గూడ, గొల్లగూడ గ్రామాల్లో 30కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ వైర్లు వ్యవసాయ పొలాలపై పడిపోవడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. తాడిపర్తిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మె నుంచి కిందికి పడిపోయింది. మల్కీజ్‌గూడలో నాలుగు కుటుంబాలకు చెందిన ఇళ్ల రేకులు గాలికి లేచిపోవడంతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, సామగ్రి పూర్తిగా తడిసిపోవడంతో నిరాశ్రయులుగా మారారు. రూ.లక్షల్లో నష్టం జరిగింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి మామిడికాయలు, పలు కూరగాయల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది పునరుద్ధరణకు మరమ్మతులు చేపట్టారు.
స్తంభాలు ఒరిగి


