చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి
యాచారం: తీవ్ర మనస్తాపంతో చెట్టుకు ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన మొరుగు యాదయ్య(45) గ్రామంలో వ్యవసాయ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో శనివారం సాయంత్రం కొందరితో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది అదేరోజు రాత్రి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపారు.
ఆరో అంతస్తు పైనుంచి పడి కార్మికుడి మృతి
శంకర్‌పల్లి: ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కార్మికుడు కింద పడి మృతి చెందిన సంఘటన మోకిల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వీరబాబు కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన బికాశ్ కుమార్ (24) కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మండల పరిధిలో ఇక్ఫాయ్ కళాశాలలో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ పని నిమిత్తం ఐదు రోజుల నుంచి వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. ఆరో అంతస్తులో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి పోయాడు. వెంటనే స్థానికులు శంకర్‌పల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


