ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల తాకిడి
అత్తాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు విద్యాశాఖ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు రాజేంద్రనగర్ మండల విద్యాధికారి కె.శంకర్‌రాథోడ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల పనితీరు విశాలమైన తరగతి గదులు, ఒక్క రూపాయి ఖర్చు లేకుంండా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఎలాంటి సదుపాయాలు లేకుండా ఇరుకు గదుల్లో డిగ్రీలు లేని శిక్షణ లేని ఉపాధ్యాయుల చేత విద్యార్థులను రుద్దడం మాత్రమే చేస్తారని అన్నారు. హంగు.. ఆర్భాటాలతో విద్యార్థులు.. విద్యార్థుల తల్లిదండ్రులను భ్రమలో పడేస్తూ పాఠశాల నుంచి అడ్మిషన్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. మధ్య తరగతి కుటుంబాల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు స్థానిక యువకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని ఎంఈఓ కోరారు. రాజేంద్రనగర్ మండల పరిధిలోని శివరాంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మంచి రికార్డులు ఉన్నాయని అన్నారు. దివంగత మాజీ హోంమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిలు ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రెండు వేలకు పైచిలుకు ఉందని అంతేస్థాయిలో ఉపాధ్యాయులు ఈ పాఠశాలకు సొంతమని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పూర్తి స్వేచ్చ ఉంటుందని ప్రతి విద్యార్థి ఎంతో దైర్యంగా స్వేచ్ఛగా తన మనోభావాలను కుటుంబ నేపథ్యం తదితర అంశాలను వివిధ సభల్లో చెప్తారన్నారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు పాఠశాలల పేర్లలో ముందు వెనుక తోకలు తగిలిస్తూ విద్యార్థి లోకాన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోనే ఉన్న ఎలాంటి పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. విద్యా శాఖ అనుమతి లేకుండా ఎలా పాఠశాల బోర్డులను ఏర్పాటు చేసుకుంటారని అలాంటి వాటిని వెంటనే తొలగించాలని ఆయన సూచించారు.
రాజేంద్రనగర్ మండల విద్యాధికారి శంకర్‌రాథోడ్


