మాల్‌ ‘సంత’సం | - | Sakshi
Sakshi News home page

మాల్‌ ‘సంత’సం

Apr 22 2025 7:02 AM | Updated on Apr 22 2025 7:02 AM

మాల్‌

మాల్‌ ‘సంత’సం

ఐదేళ్లుగా పశువుల సంతతో వచ్చిన రాబడి (రూ.లక్షల్లో)

యాచారం: జాతీయ స్థాయిలో ‘ప్రత్యేక’ గుర్తింపుతో మాల్‌ ఒక్కసారిగా మెరిసింది. రాష్ట్రంలోనే ఆత్మనిర్భర్‌ పంచాయతీ స్పెషల్‌ అవార్డు దక్కించుకున్న గ్రామంగా నిలిచింది. రంగారెడ్డి–నల్లగొండ జిల్లాల సరిహద్దు యాచారం మండల పరిధిలోని మాల్‌కు మొదటి నుంచీ వ్యాపార కేంద్రంగా పేరుంది. ప్రతి మంగళవారం ఇక్కడ పశువుల సంతతో పాటు వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతాయి. సంత రోజు రూ.కోట్లలో ఆర్థిక లావాదేవీలు జరగడంతోపాటు వందలాది మంది ఉపాధి పొందుతారు. రంగారెడ్డి–నల్లగొండ జిల్లాల నుంచే కాకుండా నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మాచర్ల, మార్కాపురం, చిలకలూరిపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చి తమకు కావాల్సిన సరుకులతో పాటు పాడి పశువులు, అరక దున్నే కాడెద్దులు కొనుగోలు చేస్తుంటారు. నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ రహదారిపై ఉన్న ఈ గ్రామం 70 ఏళ్లుగా వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోంది. జాతీయ స్థాయిలో తమ గ్రామానికి గుర్తింపు రావడంపై స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

అవార్డు దక్కిందిలా..

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అవార్డులు అందజేయడం కోసం గత నెలలో 19 అంశాల ప్రగతిపై దరఖాస్తులు ఆహ్వానించింది. ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి మాల్‌ పశువుల సంత ఆర్థిక వనరులపై దృష్టి పెట్టి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఎంపీడీఓ పంపిన నివేదిక ఆధారంగా ఈ నెల మొదటి వారంలో కేంద్ర ప్రత్యేక బృందం గ్రామాన్ని సందర్శించింది. మాల్‌ పంచాయతీకి ఏటా పశువుల సంత వేలం పాట నిర్వహణ ద్వారా రూ.80 లక్షల వరకు ఆదాయం సమకూరుతుండడం, తద్వారా గ్రామాభివృద్ధి గణనీయంగా జరగడాన్ని గుర్తించిన అధికారుల బృందం గ్రామాన్ని ఆత్మ నిర్భర్‌ నేషనల్‌ పంచాయతీ అవార్డుకు ఎంపిక చేసింది. పశువుల సంత ద్వారా వచ్చే ఆదాయం కాకుండా పన్నుల వసూళ్లు, ఇతర అభివృద్ధి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. అవార్డ్‌తో పాటు రూ. కోటి పారితోషికం దక్కనుంది.

సంతకు కలగానే శాశ్వత స్థలం

ఆత్మనిర్భర్‌ అవార్డు రావడానికి ప్రధాన కారణమైన పశువుల సంతకు శాశ్వత స్థలం ఎంపిక కలగానే మిగిలింది. ప్రతి మంగళవారం ప్రవేట్‌ వెంచర్లలోని ప్లాట్లలోనే నిర్వహణ కొసాగుతోంది. సంతకు వచ్చే మూగజీవాలకు కనీసం దాహం తీర్చేందుకు తాగునీరు, నీడ సౌకర్యం లేదు. సంత కొనసాగుతున్న పక్కనే సర్వే నంబర్‌ 640 లోని 16 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి 5 ఎకరాలు కేటాయించాలని 25 ఏళ్లుగా స్థానిక ప్రజాప్రతినిధులు విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేకపోయింది. మాల్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ సైతం ఎన్నో ఏళ్లుగా ఉంది.

జాతీయ స్థాయిలో ‘ప్రత్యేక’ గుర్తింపు

ఆత్మనిర్భర్‌ స్పెషల్‌ పంచాయతీ కింద ఎంపిక

అవార్డుకు కారణమైన పశువుల సంత

తెలంగాణ నుంచి ఎంపికై న ఏకై క గ్రామం

హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు

ఏడాది వచ్చిన ఆదాయం

2021–22 రూ. 53,00,000

2022–23 రూ. 59,00,000

2023–24 రూ. 71,03,000

2024–25 రూ.73,00,000

2025–26 రూ. 82,00,000

ఎన్నోసార్లు అధికారుల దృష్టికి..

ఐదేళ్ల పదవీ కాలంలో మాల్‌ పశువుల సంతకు శాశ్వత స్థలంపై ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. గ్రామం మధ్యలోనే సర్వే నంబర్‌ 640లో ఐదెకరాలు కేటాయించాలని కోరినా రెవెన్యూ అధికారుల్లో చలనం లేదు. సంతకు స్థలం కేటాయిస్తే మరింత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

– పడకంటి కవిత, మాజీ సర్పంచ్‌

సంతోషంగా ఉంది

రాష్ట్రంలోనే మాల్‌ ఆత్మ నిర్భర్‌ పంచాయతీ స్పెషల్‌ అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. అత్యధిక ఆర్థిక వనరుల కేటగిరీ కింద ఉన్నతాధికారులకు నివేదిక పంపించగా, స్వయంగా పంచాయతీని సందర్శించి అవార్డుకు ఎంపిక చేశారు. వచ్చే రూ.కోటి నగదుతో మరింత అభివృద్ధి జరుగుతుంది.

– నరేందర్‌రెడ్డి, ఎంపీడీఓ, యాచారం

స్థల కేటాయింపునకు కృషి

రాష్ట్రంలోనే ఇబ్రహీంపట్నం నియోజవర్గంలోని గ్రామం జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. మాల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన పశువుల సంతకు శాశ్వత స్థలం కేటాయించేలా కృషి చేస్తా.

– మల్‌రెడ్డి రంగారెడ్డి,

ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం

మాల్‌ ‘సంత’సం1
1/3

మాల్‌ ‘సంత’సం

మాల్‌ ‘సంత’సం2
2/3

మాల్‌ ‘సంత’సం

మాల్‌ ‘సంత’సం3
3/3

మాల్‌ ‘సంత’సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement