మళ్లీ దరఖాస్తు అక్కర్లేదు
సాక్షి, రంగారెడ్డి జిల్లా/బడంగ్‌పేట్: భూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న బాధితులు మరోసారి అర్జీ పెట్టుకోవాల్సిన అవరసం లేదని కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ‘ధరణి’ పోర్టల్‌లో పెండింగ్ జాబితాలో ఉన్న దరఖాస్తులన్నింటినీ కొత్తగా తెచ్చి ‘భూభారతి’ ఫోర్టల్‌లోకి బదిలీ చేశామని స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం హయత్‌నగర్, సరూర్‌నగర్ మండలాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి పాల్గొన్నారు.
సర్వే తర్వాతే రిజిస్ట్రేషన్
వ్యవసాయ, వాణిజ్య భూములను పక్కాగా పరిరక్షించే గొప్ప అవకాశాన్ని భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం బడంగ్‌పేట కార్పొరేషన్‌లోని మీటింగ్ హాలులో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొత్త చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జియో సర్వే చేసిన తర్వాతే భూములను రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు కొత్త చట్టంలో పొందుపర్చారని తెలిపారు. రాబోయే కాలంలో భూధార్ వల్ల రైతులు, ప్లాట్ల యజమానులు నష్టపోయే ప్రమాదం లేదన్నారు. రాష్ట్రంలో భూరికార్డులు సరిగా లేవనే కారణంతో ధరణిని తీసుకువచ్చారని, ఇందులోని లోపాలను సరిచేసే అవకాశం అధికారులకు లేకపోవడంతో బాధితులు కోర్టులకు వెళ్లేవారని గుర్తుచేశారు. ఇక నుంచి ఆసమస్య ఉండబోదని తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీఓలు, అక్కడా పని కాకపోతే కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. కొత్త చట్టంలో గ్రామ పహానీ, ప్రభుత్వ భూముల రిజిస్ట్రర్, మార్పుల రిజిస్ట్రర్, వనరుల రిజిస్ట్రర్ ఇలా నాలుగు రకాలుగా గ్రామ రికార్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, భూదాన్ భూములను సర్వే చేసి అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టంచేశారు. 2025 చట్టం ప్రకారం భూమి కలిగిన రైతుల పేరున ఆర్‌ఓఆర్(రికార్డ్ ఆఫ్ రైట్)లో పేర్లు ఉంటాయన్నారు. 18 రాష్ట్రాల్లోని భూ చట్టాలను పరిశీలించి, పరిశోధించి భూభారతిని తీసుకువచ్చారని వెల్లడించారు. దరఖాస్తు పెట్టుకున్న నెల రోజుల్లో మండల స్థాయిలోనే సమస్య పరిష్కామయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ శాఖను పటిష్టం చేసి, సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో గ్రామ అధికారులు(వీఆర్‌వోలు), మరో రెండు నెలల్లో సర్వేయర్ల నియామకం ఉంటుందని స్పష్టం చేశారు. పలువురు రైతులు అడిగిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, టీయూడీ ప్రోగ్రాం చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి, కార్పొరేషన్ కమిషనర్లు పి.సరస్వతి, ఆర్.జ్ఞానేశ్వర్, జల్‌పల్లి కమిషనర్ వెంకట్రామ్ పాల్గొన్నారు.
నెల రోజుల్లోపే భూ సమస్యకు పరిష్కారం
భూ భారతి చట్టంతో పక్కాగా ఆస్తుల పరిరక్షణ
కలెక్టర్ సి.నారాయణరెడ్డి
కొత్త చట్టంపై రైతులకు అవగాహన


