హామీలు అమలు చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామస్వామి
చేవెళ్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి కె.రామస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని అంతారంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రామస్వామి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అధికారంలో ఉన్న 11 ఏళ్లలో కోటి ఉద్యోగాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు తమ తీరును మార్చుకుని పేదలకు న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కార్యదర్శి జయమ్మ, సహాయ కార్యదర్శి లక్ష్మి, నాయకులు అమృత, నరసింహ, చంద్రయ్య, గంగమ్మ, పద్మమ్మ, చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.


