
పరస్పర బది‘లీలలు’!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పరస్పర బదిలీల్లో పలువురు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో రెండు మూడు నెలలు/ రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన వారు కూడా పరస్పర బదిలీ పేరుతో ఇతర జిల్లాలకు వెళ్తుండడం సందేహాలకు తావిస్తోంది. ప్రతిఫలంగా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే సర్వీసు ఎక్కువ ఉన్న వారి నుంచి ‘పెద్ద మొత్తంలో’ లబ్ధి పొందుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని అడ్డుకోవాల్సిన ఉపాధ్యాయ సంఘాలు, ఉన్నతాధికారులు పరోక్షంగా ఇందుకు సహకరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి స్థానికేతరుల కోటా 20 శాతానికి మించకూడదు. కానీ జిల్లాలో ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి డిప్యూటేషన్లపై వచ్చి చేరిన వారితో స్థానికేతరుల కోటా 50 శాతం దాటిపోయింది. స్పౌజ్ కోటాలో ఇప్పటికే 32 మంది ఉపాధ్యాయులు జిల్లాకు రాగా, తాజాగా పరస్పర బదిలీల ప్రక్రియలో భాగంగా మరో 112 మంది వచ్చి చేరినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇప్పుడెందుకు వెళ్తున్నట్లు?
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 4,054 ఎస్‌జీటీలు, 3,997 స్కూల్ అసిస్టెంట్లు, 278 మంది హైస్కూలు ప్రధానోపాధ్యాయులు, 200 మంది ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పని చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులను స్థానికత ఆధారంగా ఆయా జిల్లాలకు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని కొంత మంది ఉపాధ్యాయులకు స్థానికత ఉన్నప్పటికీ సీనియారిటీ లేకపోవడంతో ఇతర జిల్లాలకు కేటాయించింది. ఇందులో భాగంగా ఆమనగల్లు మండల పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని నాగరకర్నూలు జిల్లాకు కేటాయించింది. ఆయన ఇప్పటి వరకు రిలీవ్ కాలేదు. తనకున్న ఆర్థిక, రాజకీయ పలుకుబడితో నాలుగేళ్లుగా ఇక్కడే కొనసాగుతూ వచ్చారు. మరో మూడు రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. సర్వీసు ముగిసే సమయంలో ఆయన పరస్పర బదిలీల్లో భాగంగా వికారాబాద్‌కు వెళ్తున్నారు. ఆయన స్థానంలో వికారాబాద్ జిల్లాకు చెందిన సర్వీసు ఎక్కువగా ఉన్న మరో ఉపాధ్యాయురాలు జిల్లాకు వచ్చారు. పరస్పర బదిలీల్లో భాగంగా ఇద్దరి మధ్య పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా 25 మంది వరకు పరస్పర బదిలీల్లో వెళ్లి.. అటు నుంచి వచ్చే వారి నుంచి భారీగా ‘పుచ్చుకున్నట్లు’ తెలిసింది. నిజానికి సర్వీసు ముగింపు దశలో ఉన్న వారిని రిలీవ్ చేయకూడదు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.
జిల్లా విద్యాశాఖలో అడ్డగోలు ట్రాన్స్‌ఫర్లు
అనుకూలమైన చోటుకు వెళ్లేందుకు అడ్డదారులు
నిబంధనలకు విరుద్ధంగా రిలీవింగ్.. జాయినింగ్
భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు
ఇష్టారీతిన పోస్టింగ్‌లు
ఆరోగ్య సమస్యలు, పిల్లల ఉన్నత చదువుల పేరుతో ఇతర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నేతలు సహా ప్రజాప్రతినిధుల బంధువులు రాజకీయ, ఆర్థిక పలుకుబడిని అడ్డంపెట్టుకుని డిప్యూటేషన్‌పై జిల్లాకు వస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కాకుండా, ఇంటికి సమీపంలో, తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లలో (ఫోకల్) పోస్టింగ్‌లు పొందుతున్నారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే చదువుకుని, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుడిగా ఎంపికై న వారు ఇతర మండలాల్లోని నాన్ ఫోకల్ పోస్టుల్లో పని చేయాల్సి వస్తోంది. సీనియార్టీ పేరుతో పదోన్నతులను కొల్లగొడుతున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఒక్క ఉపాధ్యాయ సంఘం కూడా అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. జిల్లాలో ఇప్పటికే 20 వేల మందికిపైగా బీఈడీ, టెట్ అర్హత పరీక్షలు పూర్తి చేసుకుని డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం పోస్టుల భర్తీకి రెండు మూడేళ్లకోసారి నోటిఫికేషన్లు జారీ చేస్తే.. ఆయా సమయాల్లో ఖాళీ లేక జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొంది.