2023–24లో రాష్ట్రంలో గణనీయంగా మెరుగుదల
జాతీయ స్థాయిని మించి మన రాష్ట్రంలో నెలవారీ తలసరి వినియోగ వ్యయం
ఇందుకు ప్రధాన కారణం డీబీటీ ద్వారా పథకాల అమలు
గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో తగ్గుతున్న అంతరం
జాతీయ సగటు పొదుపు కంటే ఏపీలోనే ఎక్కువ శాతం పొదుపు
జాతీయ సగటు పొదుపు 31 శాతం ఉంటే... ఏపీలో 34 శాతం
2023–24లో దేశంలో గ్రామీణ, పట్టణ పేదరికం తగ్గుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక వెల్లడి
రాష్ట్రంలో గత ఆర్థిక ఏడాది (2023–24)లో గ్రామీణ జీవనోపాధి గణనీయంగా మెరుగు పడింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల నెలవారీ తలసరి వినియోగ వ్యయం ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం భారీగా తగ్గింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో ప్రజల పొదుపు సైతం ఎక్కువగానే ఉంది. ఈ ప్రగతి సాధనలో నాటి ప్రభుత్వం అమలు చేసిన నగదు బదిలీ పథకాలు కీలక పాత్ర పోషించాయి. – ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక
సాక్షి, అమరావతి: గత∙ఆర్థిక ఏడాదిలో మన రాష్ట్రంలో గ్రామీణ జీవనోపాధి గణనీయంగా మెరుగుపడటంతోపాటు జాతీయ స్థాయిని మించి ప్రజల నెలవారీ తలసరి వినియోగ వ్యయం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంతో పాటు దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం తగ్గిందని చెప్పింది. ఇందుకు ఆయా ప్రభుత్వాలు గ్రామీణ ప్రజలకు నగదు బదిలీ ద్వారా పథకాలను అమలు చేయడం, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగు పరచడమే కారణమని స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రైతుల ఆదాయం పెరిగిందని తెలిపింది.
దీంతో గ్రామీణ జీవనోపాధి గణనీయంగా మెరుగు పడినట్లు నివేదిక పేర్కొంది. మధ్య ఆదాయ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో 2011–12లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం 53 శాతం ఉండగా, 2022–23లో 39 శాతానికి తగ్గిందని, 2023–24లో 35 శాతానికి తగ్గిందని నివేదిక వెల్లడించింది. దేశంలో కూడా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం భారీగా తగ్గిందని తెలిపింది. 2009–10లో గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగం వ్యయంలో అంతరం 88.2 శాతం ఉండగా, 2023–2024లో 69.7 శాతానికి తగ్గిందని పేర్కొంది.
2022–23తో పోల్చితే 2023–24లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం పెరుగుదలలో ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపింది. పట్టణ నెలవారీ తలసరి వినియోగ వ్యయం కన్నా, గ్రామీణ తలసరి వినియోగం వ్యయం పెరుగుదల ఏపీలో ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. జాతీయ స్థాయిలో పొదుపు 31 శాతం ఉంటే, రాష్ట్రంలో 34 శాతం ఉందని వెల్లడించింది. దేశంలో 2022–23లో గ్రామీణ పేదరికం 7.20 శాతం ఉండగా, 2023–24లో 4.86 శాతానికి తగ్గిందని తెలిపింది. పట్టణాల్లో 2022–23లో 4.60 శాతం పేదరికం ఉండగా, 2023–24లో 4.09 శాతానికి తగ్గిందని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment