సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు.. వియ్యాల వారి విందు.. ఓహోహ్హో నాకే ముందు’ మాయాబజార్ సినిమాలో పాట ఇది. తెలుగు వారి పెళ్లి భోజనాల్లో వడ్డించే ప్రత్యేక పిండివంటలైన గారెలు, బూరెలు, అరిసెలు, లడ్డూ, అప్పడం, దప్పళం, పాయసం వంటి వంటకాలను ఈ పాటలో నోరూరించేలా వెండితెరపై చూపించారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకంటే.. ఇటువంటి వంటకాలతో తూర్పు గోదావరి రుచులంటే నోరూరిపోయే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు ‘వేళంగి’పై తప్పనిసరిగా పడుతుంది. ఎందుకంటే ఈ గ్రామంలో వంటలకు పేరొందిన నలభీములు ఎక్కువగా ఉంటారు. వేళంగితో పాటు ద్రాక్షారామ కూడా పాకశాస్త్ర ప్రవీణులకు నెలవు. వేళంగి వారు వంట చేస్తే నలభీములు దిగి వచ్చినట్టే చాలామంది భావిస్తారు. మాయాబజార్ పాటలోని చాలా వంటకాలను ఈ గ్రామాల్లోని చేయి తిరిగిన వంటగాళ్లు అలవోకగా చేసేస్తారు.
ఆ నలుగురితో..
1970వ దశకం నాటి మాట. నాడు కపిలేశ్వరపురం, వెల్ల జమీందార్లకు నిత్యం వందలాది మంది వంట చేసి పెట్టేవారు. కాలక్రమంగా జమీందారీ వ్యవస్థ కనుమరుగు కావడంతో ఈ వంటవారిలో కొందరు ప్రస్తుత కాకినాడ జిల్లా కరప మండలంలోని వేళంగి.. మరికొందరు కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామకు పొట్ట చేత పట్టుకుని వచ్చేశారు.
జమీందార్ల జమానాలో తాతల కాలం నుంచి వస్తున్న వంటకాల తయారీని వారసత్వంగా ఇప్పటికీ వారు కొనసాగిస్తున్నారు. వేళంగిలో చీకట్ల సత్తియ్య, పెద్దిరెడ్డి పెదకాపు, పెద్దిరెడ్డి సత్యనారాయణ, నేదునూరి సత్తిబాబు– ఈ నలుగురితో మొదలైన వంటకాల తయారీ ప్రస్థానం ఇప్పుడు వందల సంఖ్యకు చేరుకుంది. ఆ నలుగురి తరువాత చీకట్ల వెంకన్న, పెదిరెడ్డి వెంకటేశ్వరరావు, నల్లా శివశంకరప్రసాద్.. ఇలా 150 కుటుంబాల వారు పాకశాస్త్రంలో ప్రావీణ్యం సాధించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను తమ వంటకాలతో కట్టిపడేస్తున్నారు.
వంట ఏదైనా.. రుచుల వడ్డన
శాకాహారం, మాంసాహారం.. వంట ఏదైనా వేళంగి వంటమేస్త్రులు ఇరగదీస్తారని పేరు. సంపన్నుల ఇళ్లు మొదలు.. ఎగువ మధ్య తరగతి వర్గాల వరకూ పెళ్లిళ్లు, పేరంటాలు, విందులు, వినోదాల్లో వేళంగి వంటకాలకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడి వంటమేస్త్రులు 20 నుంచి 50 రకాల ఘుమఘుమలాడే వంటకాలను క్షణాల్లో సిద్ధం చేసేస్తారు. సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లల్లో జరిగే వివాహాలు, ఇతర శుభకార్యాలు, రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో కూడా వేళంగి వారే వంటలు చేస్తూంటారు.
టీడీపీ వ్యవస్థాపకుడు, నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజకీయ శిక్షణ శిబిరాలు నిర్వహించినంత కాలం, వైఎస్సార్ సీపీ ప్లీనరీ, తాజాగా వైఎస్సార్ సీపీ నిర్వహించిన జయహో బీసీ మహాసభలో సైతం వీరు చేసిన వంటకాలు నోరూరించాయి. దివంగత నందమూరి హరికృష్ణ కుమారుడు, జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు జానకిరాం అత్తవారిల్లు వేళంగిలోనే ఉంది. జానకిరాం పెళ్లి, కుమారుల పంచెకట్టు, సినీనటుడు బాలకృష్ణ ఇంట జరిగిన శుభకార్యాల్లో ఈ ఊరి తయారీదార్లు చేసిన వంటకాలు ఔరా అనిపించుకున్నాయి.
ఎన్నో విశేషాలు..
వెజ్‌లో డ్రైఫ్రూట్స్‌తో గుమ్మడి హల్వా, వెజ్ కట్లెట్, మిక్స్‌డ్ ధమ్ బిర్యానీ, మష్రూమ్ మటన్ మసాలా, వెల్లుల్లి జీడిగుండ్లు ములక్కాడ గుజ్జు, కాజూ బుల్లెట్, పనసకాయ చిల్లీ కర్రీ, మద్రాస్ సాంబారు, క్రీమ్ మజ్జిగ పులుసు.. నాన్ వెజ్‌లో బొమ్మిడాయల పులుసు, పీతల ఫ్రై వంటివాటిని వేళంగి నలభీములు ఎంతో రుచికరంగా తయారు చేస్తారు. వీటిని లొట్టలేసుకుని తినాల్సిందే.
20 వేలు మొదలు 50 వేలు లేదా లక్ష మందికి కూడా వారి అభిరుచికి తగినట్టుగా 50 నుంచి 100 రకాల వంటకాలు చేసిపెట్టే సామర్థ్యం వేళంగి వంట తయారీదారుల సొంతం.
నాలుగైదు ఎకరాల భూమి ఉన్నా, గౌరవప్రదమైన వృత్తుల్లో కొనసాగుతున్నా.. వంటలు చేయడమంటే ఈ ఊరివారు వరంగా భావిస్తారంటే ఆశ్చర్యమే మరి.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చదివి, ఆక్వా ల్యాబ్ నిర్వహిస్తున్న సానా శ్రీను.. వంటలు చేయడాన్ని ప్రవృత్తిగా పెట్టుకున్నారు. ఈయన వేళంగి వంటకాలపై ఏకంగా ఓ వెబ్‌సైటే ప్రారంభించారు. తద్వారా తాను పుట్టిన గ్రామాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు.
ఇక్కడి వారు ఆస్తిపాస్తులున్నా వంటలు చేయడం మానుకోరు. అనాదిగా తాత ముత్తాతల నుంచి వస్తున్న వారసత్వాన్ని కొనసాగించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వంటలు చేయడం వారికి ఒక అభిరుచి.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి పేరున్న వేళంగి వంట మేస్త్రులకు పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి అంతగా ముందుకు రావడం లేదని వీరు ఆవేదన చెందుతున్నారు. ఒకటి రెండు ఫంక్షన్లకు వంటకానికి వెళ్తే ఏడాది పొడవునా జీవితం సంతోషంగా గడిచిపోతుందని వీరు చెబుతారు. అలా చేతినిండా సంపాదన ఉన్నా వంటవాడు అనేసరికి పిల్లనివ్వాడానికి కొందరు ముఖం చాటేస్తున్నారనే వేదన వీరిని వెంటాడుతోంది.
పోటాపోటీగా వేళంగి, ద్రాక్షారామ
ద్రాక్షారామ కూడా వంటలకు పెట్టింది పేరు. ఇక్కడి వారు తయారు చేసే వంటకాల రుచులు రాష్ట్రంలో అందరూ ఆస్వాదించిన వారే. శుభకార్యక్రమాలకు పసందైన విందు వడ్డించడంలో వేళంగి, ద్రాక్షారామ మధ్య చాలాకాలంగా గట్టి పోటీ కొనసాగుతోంది. వేళంగి అయినా ద్రాక్షారామ అయినా వీరి ముందు తరాల వారు జమీందార్ల వద్ద పేరుప్రఖ్యాతులున్న వంట వారే కావడం విశేషం. ఇప్పుడు ద్రాక్షారామలో సైతం పదుల సంఖ్యలో వంటమేస్త్రులున్నారు. పెట్టా శంకరరావు చేతి వంట లొట్టలేసుకుని ఆరగించాల్సిందే. లక్ష ఆపైన సంఖ్యలో జనం వచ్చే పెద్ద ఫంక్షన్లకు శంకరరావుతో పాటు ఆయన బృందానికి వంట ఆర్డర్లు వస్తూంటాయి. ఈ ప్రాంతానికి చెందిన సుమారు 70 మంది, సమస్త సరంజామాతో గంటల వ్యవధిలోనే లక్ష మందికి విందు ఏర్పాటు చేయడంలో దిట్టలు. ద్రాక్షారామలో ఇప్పుడు వంద మందికి పైనే పాకశాస్త్రాన్ని అభ్యసించి గరిటె తిప్పుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment