
బేల్దారి పనిచేసుకుంటున్న యార్లవాండ్లపల్లె గ్రామస్తులు
శతాబ్దం క్రితం నుంచి వారి వృత్తి దొంగతనాలు, దోపిడీలు. చుట్టుపక్కల పల్లెలే కాదు.. జిల్లా వ్యాప్తంగా వెళ్లి దొంగతనాలు చేసి అందిన కాడికి దండుకునేవారు.. దొంగలు వారే అని తెలిసి ఆ ఊరికి పోలీసు పటాలం వెళ్లినా వారు లెక్క పెట్టేవారు కాదు. వడిసేలతో రాళ్లు విసిరి పోలీసులపై ఎదురు దాడికి దిగేవారు. ఇంతటి కరడు గట్టిన నేరస్తుల్లో క్రమక్రమంగా మార్పు మొదలైంది. ఇప్పుడు ఆ ఊరు మారిన మనుషులతో.. శ్రమ జీవన సౌందర్యంతో ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది. పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో పోలీసు స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న యార్లవాండ్లపల్లె బతుకు చిత్రం ఇదీ..
యార్లవాండ్లపల్లెకు మూన్నెళ్ల క్రితం వేయించిన రోడ్డు
వైఎస్సార్ జిల్లా యార్లవాండ్లపల్లెలో 90 కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న వారంతా ఒకే తెగకు చెందిన వారు. మాట్లాడేది తెలుగు భాషే. అయినా మాట తీరు వేరుగా ఉంటుంది, ఆ మాట తీరు ఆ ఊరు వాళ్లకు తప్ప ఇరుగు పొరుగు ఊర్లలో ఎక్కడా ఉండదు. ఆ ఊరు పేరు మోసిన దొంగలకు నెలవు. ఊరు పుట్టినప్పటి నుంచి స్థానికంగానే కాదు జిల్లా వ్యాప్తంగా దారి దోపిడీలు, దొంగతనాలు చేయడం వారి వృత్తి. ఇళ్లకు కన్నాలు సైతం వేసి దోచుకెళ్లేవారు. అంతే కాదు ఏకంగా పోలీసులకు చెప్పి మరీ వారి ఇళ్లలోనే దొంగతనాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే చక్రాయపేటలో ఆ ఊరిని దృష్టిలో ఉంచుకొనే పోలీసు స్టేషన్ పెట్టినట్లు ప్రచారం ఉంది. అప్పట్లో జిల్లాలో ఎక్కడ దొంగతనాలు జరిగినా పోలీసులు నేరుగా ఇక్కడికి వచ్చి వీరిని పట్టుకెళ్లి చిత్ర హింసలు పెట్టేవారు. ఈ ఊర్లో అందరికీ చెన్నప్ప, చెన్నయ్య, కొండయ్య, చెన్నమ్మ, కొండమ్మ అనే పేర్లే ఉండేవి. దీంతో వారు దొంగతనం చేసింది మేము కాదంటే మేము కాదు. ఈ పేరు గల వారు ఊర్లో ఇంకా ఉన్నారు. వారేమో పోండి అంటూ పోలీసులను దబాయించే వారు. దీంతో పోలీసులకు దిక్కు తోచక అప్పట్లో గడ్డలోడు, పిల్ల చెన్నుగాడు, ఆరేల్లోడు, తోల్లోడు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మారు పేరు పెట్టి కేసులు నమోదు చేసేవారు.
ఇంతటి పేరు మోసిన దొంగలైనా కొత్త వారు ఊర్లోకి వెళ్లి నావద్ద బంగారు, డబ్బు ఉంది. బస్సు లేదు ఈరాత్రికి ఇక్కడే పడుకుంటామని చెబితే వారికి మర్యాదలు చేసి ఉదయాన్నే సాగనంపే వారు అని కూడా చెప్పేవారు. సాయంత్రం అయ్యే సరికి చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సారా తాగి ఊరు వెలుపల ఉన్న పెద్ద రాతి బండపై కూర్చుంటే ఆ సమయంలో వారిని పట్టు కోవడానికి పోలీసులు వెళ్లాలన్నా భయపడే వారట. తుపాకులు పట్టుకొచ్చినా వారి వద్ద ఉన్న వడిశలతో తరిమి కొట్టే వారట.
వీరి ఆగడాలు శృతి మించడంతో పోలీసులు ఆ ఊరి మీద పడి చాలామార్లు దొరికిన వారిని దొరికినట్లు పట్టుకెళ్లి స్టేషన్‌లో పెట్టారు. దొంగలను గుర్తించి చితక్కొట్టారు. కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పారు. పోలీసుల వరుస దాడులను తట్టుకోలేక ఆ దొంగల్లో భయం పుట్టింది. దొంగలు కావడంతో వారి పిల్లలకు వేరే వారు అమ్మాయిలను ఇచ్చేవారు కాదు. ఈ కారణాలతో వారిలో కొద్దిగా మార్పు వచ్చింది.
దొంగతనం మాని.. సారాను ఎంచుకొని
దొంగతనాలను పూర్తిగా మానుకొని నాటు సారా కాచి విక్రయించడం జీవనంగా ఎంచుకున్నారు. ఇళ్లల్లోనే సారా కాచడం, విక్రయించడానికి అలవాటు పడ్డారు. వారిని సారా కాపు మాన్పించాలని అధికార యంత్రాంగం సర్వ ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఎన్ని సార్లు ఊట ధ్వంసం చేసినా వారిలో మార్పు రాలేదు. కేసులు పెట్టినా భయ పడకుండా యథేచ్ఛగా సారా కాచి విక్రయించే వారు. గతంలో అదర్‌సిన్హా కలెక్టరుగా ఉన్న సమయంలో ఆ ఊరి వాసులు సారా మానుకుంటే దత్తత తీసుకొని సమస్యలన్నింటినీ తీర్చి అభివృద్ధి చేస్తామని చెప్పినా వారు మారలేదు.
ఫలించిన ఎస్‌ఐ గోవిందరెడ్డి కృషి
ఐదేళ్ల క్రితం చక్రాయపేట ఎస్‌ఐగా పనిచేస్తుండిన గోవింద రెడ్డి వారిలో మార్పు తీసుకు రావాలని తన ప్రయత్నాన్ని మొదలెట్టారు. పలు దఫాలుగా వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. సారా కాచడం మానుకోకపోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డులు రద్దు చేయిస్తానని, దీంతో మీకెలాంటి ప్రభుత్వ పథకాలు అందవని భయపెట్టారు. దీంతో వారు ఆలోచనలో పడి సారా కాచడం మానుకున్నారు.
కూలి పనులు, చిరు వ్యాపారాలు
తమ పెద్దలు చేసిన దోపిడీలు, సారా కాచడం లాంటి సంఘ వ్యతిరేక పనులు తమకు వద్దని భావించి చాలామంది నేడు చెమటోడ్చి పనిచేయడానికి అలవాటు పడ్డారు. కొందరు మహిళలు పండ్లు, కాయ గూరలు పల్లెలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటే మరికొందరు వ్యవసాయ కూలి పనులకు వెళుతుంటారు. పురుషులైతే గొర్రెలు, మేకల వ్యాపారం, ఐస్ విక్రయాలు వంటివి చేస్తూ హాయి గా జీవనం సాగిస్తున్నారు. ఊరికి కూతవేటు దూ రంలో జెడ్పీ హైస్కూలు ఉన్నా బడివైపు ఎవరూ కన్నెత్తి చూసే వారు కాదు. ప్రస్తుతం గ్రామంలో చదువు వైపు మొగ్గు చూపుతున్నారు. ఊర్లో డిగ్రీ చదివిన వారు ఇద్దరు. ఇంటర్ మీడియట్ చదువు తున్న వారు కొందరు ఉన్నారు. ప్రతి ఇంటా చెట్లను పెంచడంతో ఊరు హరిత వనాన్ని తలపిస్తోంది. (క్లిక్: కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ.. ఇప్పుడు ఇదే ట్రెండ్!)
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒనగూరిన సొబగులు
యార్లవాండ్ల పల్లెలో అనేక సమస్యలు ఉండేవి. గత పాలకులు వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఊర్లోకి వెళ్లేందుకు దారి కూడా లేక పోవడంతో పొలాల వెంబడి వెళ్లే వారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డిలు ఆ ఊరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రైతులతో మాట్లాడి జెడ్పీ హైస్కూలు వద్ద నుంచి ఊరి వరకు గ్రావెల్ రోడ్డు వేయించారు. గ్రామంలో ఇతర అభివృద్ధి పనులకు సుమారు రూ.43 లక్షలు నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
జగన్ సారు ముఖ్యమంత్రి అయ్యాకే
మా ఊర్లో అన్ని చెడ్డ పనులు మాని బతుకుతున్నా గతంలో మాగోడు ఎవరూ పట్టించుకోలేదు. రోడ్డు వేయాలని అడిగినా గత ప్రభుత్వంలో నాయకులు స్పందించలేదు. జగన్ సారు ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ కొండారెడ్డి సహకారంతో రోడ్డు వేశారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించారు. మా గ్రామంలో ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
– తంగేడుపల్లె సుబ్బరాయుడు, గ్రామస్తుడు, యార్లవాండ్లపల్లె
జీవితాలు మారేవి కావేమో
మా పెద్దోళ్ల మాదిరే దొంగతనాలు, నాటుసారా కాయడం చేస్తుంటే ఇప్పటికి పోలీసులతో తన్నులు తింటూ ఉండేవాళ్లం. మా జీవితాలు మారేవి కావు. తప్పుడు దారిలో వెళ్లవద్దని అందరం కూడబలుక్కొని ఆ వృత్తులకు స్వస్తి పలికాము. అందరం కూలి పనులు, వ్యాపారాలు చేసుకుంటున్నాము. పిల్లలు కొందరు చదువుకుంటున్నారు. యువకులు ఆటోలు నడుపుతూ బతుకుతున్నారు. అందరం సంతోషంగా ఉన్నాం.
– కూతల ఈశ్వరయ్య, గ్రామస్తుడు, యార్లవాండ్ల
Comments
Please login to add a commentAdd a comment