నిందితుడు అరవింద్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : మేకులు (స్క్రూలు) మింగిన ఓ రిమాండ్ ఖైదీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా సెంట్రీ కళ్లు గప్పి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన సీహెచ్.అరవింద్ పలు దొంగతనం కేసుల్లో నిందితుడు. అతడిని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేయగా, ఖమ్మం జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన ఓ దొంగతనం కేసులో పీటీ వారెంట్‌పై తీసుకువచ్చిన పోలీసులు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు.
అరవింద్ శనివారం జైలులో మేకులు మింగడంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మేల్ సర్జికల్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి బాత్‌రూంకు వెళ్లి వస్తానని చెప్పిన అరవింద్ బాత్‌రూంలో ఉన్న కిటికీ ఊచను తొలగించి అందులోంచి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సంగారెడ్డిటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పరారీలో ఉన్న అరవింద్‌ను పట్టుకునేందుకు మూడు బృందాలను నియమించినట్లు పోలీసులు తెలిపారు. అరవింద్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయి.
జైలులో మేకులెలా దొరికాయి?
సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అరవింద్‌కు జైలులో మేకులు ఎలా దొరికాయనేది ప్రశ్నార్థకంగా మారింది. జైలులో ఉండే స్విచ్‌బోర్డుకు ఉన్న స్క్రూలను మింగినట్లు జైలు అధికారులు భావిస్తున్నారు. అరవింద్ కడుపు నొస్తుందని జైలు అధికారులకు చెప్పగా అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్‌రే తీయడంతో ఆయన కడుపులో రెండు మేకులు ఉన్నట్లు గుర్తించారు.
అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సెంట్రీ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అరవింద్ తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రిమాండ్ ఖైదీలు బాత్‌రూం వెళితే తప్పనిసరిగా చేతులకు గొలుసులు వేయాల్సి ఉంటుంది. అయితే ఏఆర్ పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అరవింద్ పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment