చెరువులో మునిగి విద్యార్థి మృతి
రామాయంపేట(మెదక్): చెరువులో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం రామాయంపేట మండల పరిధిలోని కాట్రియాల గ్రామంలో చోటు చేసకుంది. పోలీసుల కథనం మేరకు.. కాట్రియాల గ్రామానికి చెందిన కాస రాజు కుమారుడు రిస్విత్(12), బాబాయి కుమారుడు రేవంత్, మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి గ్రామ శివారులోని పెద్ద చెరువులో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి రిస్విత్ మృతి చెందాడు. మృతుని తండ్రి కాస రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రిస్విత్ ఏడవ తరగతి చదువుతుండగా ఒంటి పూట బడులు కావడంతో విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు.
అంగడి వేలం రెండోసారి వాయిదా
హుస్నాబాద్: వారాంతపు సంత బహిరంగ వేలం పాట శుక్రవారం మరోసారి వాయిదా పడింది. వివరాల్లోకి వెళ్తే.. 17న మొదటి సారి బహిరంగ వేలం పాట నిర్వహించారు. గతేడాది అంగడి వేలం రూ. కోటి 20 లక్షల 26 వేలు పలికింది. దీనికి అదనంగా 5 శాతం కలిపి రూ. కోటి 26 లక్షల 27 వేల 300కు సర్కార్ పాటను ప్రారంభించారు. వేలం పాటను తగ్గించాలని గుత్తేదారులు ఎవరూ పాట పాడకపోవడంతో వేలం వాయిదా వేశారు. ఈ విషయాన్ని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ దృష్టికి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తీసుకెళ్లారు. వేలంను తగ్గించేది లేదని నిబంధనల ప్రకారం అంగడి వేలం పాటను నిర్వహించాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం మరోసారి నిర్వహించారు. గుత్తే దారులు మెట్టు దిగకుండా వేలం పాటను తగ్గించాలని డిమాండ్ చేశారు. తగ్గించిన తర్వాతే వేలంలో పాల్గొంటామని వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో రెండోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.