విషాద వలసగీతం
● ప్లేగు వ్యాధితో తలోదిక్కుకు వలసపోయిన గ్రామస్తులు ● కుప్పానగర్, మేదపల్లి గ్రామాలలో నివాసం ● సాక్ష్యాలుగా మిగిలిన ఆంజనేయస్వామి విగ్రహం, దర్గా.. ● ఊరితో పేగుబంధాన్ని తెంచిన ప్లేగు వ్యాధి ● రెవెన్యూ ఆదాయం గినియర్‌పల్లికి
ఇళ్లు, జనాలు లేని రాంపూర్
రాంపూర్ గ్రామ వివరాలు
అప్పట్లో ఉన్న కుటుంబాలు 30-40
జనాభా 200(సుమారు)
సర్వే నంబర్లు 17
సాగులో ఉన్న భూమి 351.09 ఎకరాలు
మా తాతల కాలం నుంచి నివాసం
మా తాతల కాలం నుంచి కుప్పానగర్ గ్రామంలోనే నివాసం ఉంటున్నాం. అప్పట్లో రాంపూర్ గ్రామం నుంచి వచ్చి ఇక్కడ నివా సం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాం. ప్లేగు వ్యాధి రావటంతో భయాందోళనతో గ్రామాన్ని వదిలి వచ్చినట్లు పెద్దలు చెప్పేవారు.
–రాంపూర్ మచ్కూరి రాజమహ్మద్,
కుప్పానగర్
రెవెన్యూ ఆదాయం మళ్లించాలి
రాంపూర్ గ్రామ రెవెన్యూ ఆదాయం గినియార్‌పల్లికి సమకూరుతుంది. అన్ని వసతులతోపాటు దగ్గరగా ఉండే కుప్పానగర్ గ్రామానికి రెవెన్యూ ఆదాయం మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. గతంలో రెవెన్యూపరంగా ఏదైనా అవసరం ఉంటే కుప్పానగర్ గ్రామ వీఆర్‌వో ఇచ్చేవారు. అక్కడికి వెళ్లే రహదారులను అభివృద్ధి చేయాలి.
–రాంపూర్ ప్రకాశ్, కుప్పానగర్
ఒకప్పుడు లేలేత భానుడి కిరణాలతో మేల్కొనే గ్రామం...వ్యవసాయ పనులకెళ్లే జనాలతో, వంటింటి పనులు చేసుకునే మహిళలతోనూ, ఆడి పాడే పిల్లాపాపలు, పశుపక్ష్యాదులతోనూ నిత్యం జన సంచారంతో సందడిగా ఉండేది. ఇదంతా కొన్ని దశాబ్దాల క్రితం. కానీ, ఇప్పుడా పల్లెసీమ చరిత్రకు ఆనవాళ్లై పోయింది. ఇప్పుడా ఊళ్లో ఇళ్లూ లేవు...అందులో జనాలూ లేరు. నాడు మహమ్మారిగా పేరొందిన ప్లేగు వ్యాధి ఊరిని కబళించడంతో భయంతో తలోదిక్కుకూ వలస వెళ్లిపోయారు. రెవెన్యూ రికార్డుల్లోనూ, చరిత్రపుటల్లోనూ మాత్రమే మిగిలిపోయిన ఝరాసంగం మండలానికి చెందిన ఆ ఊరి పేరు రాంపూర్. ఈ గ్రామానిది ఓ విషాద వలసగీతం.
సంగారెడ్డిజోన్: రాంపూర్‌లో వ్యవసాయ భూములు, పాడుబడిన ఇళ్ల పునాదులు, ఓ గుడి, దర్గా మాత్రమే ఉన్నాయి. ఇక రెవెన్యూ రికార్డుల్లో మాత్రం వ్యవసాయభూములు, వాటి సర్వే నంబర్లు మాత్రమే కనిపిస్తాయి. 90 ఏళ్ల క్రితం 30 నుంచి 40 కుటుంబాలు సుమారు 200 మంది వరకు నివాసం ఉండేవారు. అప్పట్లో ప్లేగు మహమ్మారి వ్యాధితో గ్రామంలో చాలామంది మృత్యువాత పడ్డారు. దీంతో సరైన వైద్యం, వైద్య సదుపాయాలు లేక భయాందోళనకు గురైన గ్రామస్తులు ఇతర గ్రామాలకు వలస వెళ్లిపోయారు. ఇందులో ఎక్కువమంది ఇదే మండలంలోని కుప్పానగర్, మేదపల్లి గ్రామాల్లో నివాసం ఉంటున్నారు.
17 సర్వే నంబర్లు.. 351.09 ఎకరాల భూమి
రాంపూర్ గ్రామంలో జనం లేకపోయినప్పటికీ అక్కడి ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన వారు భూములను సాగు చేసుకుంటూ పంటలు పండిస్తున్నారు. ప్రతీ రోజు నివాసం ఉంటున్న గ్రామాల నుంచి వెళ్లి పనులు చేసుకుని వస్తుంటారు. రెవె న్యూ (ధరణి) ప్రకారం రాంపూర్ గ్రామం పేరుతో 17 సర్వే నంబర్లు 351.09 ఎకరాల భూముల వివరాలు అందుబాటులో ఉన్నాయి.
ఆదాయం గినియర్‌పల్లికి
రాంపూర్ గ్రామ రెవెన్యూ ఆదాయం ఇదే మండలంలోని గినియార్‌పల్లి గ్రామానికి సమకూరుతోంది. గ్రామంలో భూముల అమ్మకాలు, కొనుగోలు జరిగినా వాటి ద్వారా వచ్చే ఆదాయం గినియార్‌పల్లికి చేరుతుంది. రాంపూర్‌లో ఉన్న ఒక కంకర్ క్రషర్ వల్ల వచ్చే ఆదాయం కూడా గినియార్‌పల్లికే చెల్లిస్తున్నారు. గతంలో ఏదైనా రెవెన్యూ రికార్డులు అవసరం ఉంటే కుప్పానగర్ గ్రామ వీఆర్‌వో ఇచ్చే వారని రాంపూర్ గ్రామస్తులు చెబుతున్నారు.
అనుసంధానంగా కుప్పానగర్
రాంపూర్ గ్రామానికి కుప్పానగర్ అనుసంధానంగా ఉండేది. వ్యవసాయ భూములు ఇక్కడి శివారులో ఉన్నప్పటికీ సంబంధం లేని గినియార్‌పల్లికి రెవెన్యూ ఆదాయం ఎందుకు సమకూరుతుందో అర్థం కావటం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని కుప్పానగర్‌కు మళ్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం
రాంపూర్‌లో ఉన్న దర్గా
ప్రస్తుతం జనావాసం లేని ఆ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం, గైబ్ సాహెబ్ దర్గాతో పా టు ఇళ్లకు సంబంధించిన పునాదిరాళ్లు నాటి గ్రామానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అక్కడ ఉన్న స్వామి వారి విగ్రహానికి అప్పుడప్పుడు పూజలు, దర్గా వద్ద ఏడాదికొకసారి ప్రార్థనలు చేస్తున్నారు. రాంపూర్‌కు బిడెకన్నె గ్రామానికి మధ్య గుట్టపై శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ నిత్య పూజలు చేస్తుంటారు. పలు సినిమాల షూటింగ్‌లు సైతం జరిగాయి.
విషాద వలసగీతం
విషాద వలసగీతం
విషాద వలసగీతం
విషాద వలసగీతం
విషాద వలసగీతం


