ఎస్పీ పరితోష్ పంకజ్
పటాన్‌చెరు టౌన్: జిల్లాలోని మహిళా ఉద్యోగుల భద్రతకు కట్టుబడి ఉన్నామని ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టం చేశారు. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఐలా కార్యాలయంలో బుధవారం సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పరిశ్రమల భద్రత, ట్రాఫిక్ సమస్యల నివారణకు ఏర్పాటు నిర్వహించిన సమావేశంలో ఎస్పీ పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో పరిశ్రమల భద్రతా, పరిశ్రమలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల భద్రతకు కట్టుబడి ఉన్నామని, వారికి భద్రత కోసం షి–షట్లర్ పేరుతో బస్సుల నడుపుతున్నామని, త్వరలోనే మరిన్ని బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పరిశ్రమల భద్రత దృష్ట్యా ప్రతి కంపెనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, సరైన గుర్తింపు కార్డులు ఉన్న వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని సూచించారు. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం పరిశ్రమలకు చెందిన వాహనాల డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించాలని ఆదేశించారు. భారీ వాహనాలు రాత్రి సమయంలోనే అనుమతించాలని సూచించారు. సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ బలోపేతానికి అన్ని పరిశ్రమలు ముందుకు రావాలని కోరారు. పరిశ్రమలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పారిశ్రామికవాడలలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి త్వరలో ట్రాఫిక్ మార్షల్స్‌ను నియమిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావ్, పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, ట్రెజరర్ రమణారెడ్డి, ఐలా వైస్ చైర్మెన్ రాఘవరెడ్డి, ఐలా ట్రెజరర్ రాజు, వివిధ ఫార్మా, ఇంజనీరింగ్ కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సీఐలు వినాయక్ రెడ్డి,స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


