● కలెక్టర్ వల్లూరు క్రాంతి ● రూ.25 కోట్లతో సీఎస్‌ఆర్ నిధులు వినియోగం ● పనుల పురోగతిపై సమీక్ష
సంగారెడ్డి జోన్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం సీఎస్‌ఆర్ నిధుల వినియోగం, పనుల పురోగతిపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలో సీఎస్‌ఆర్ నిధులతో ప్రభు త్వ పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల మెరుగు కోసం వివిధ అభి వృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 2024– 25 ఆర్థిక ఏడాదిలో జిల్లాలో రూ.25 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి జిల్లాలోని పరిశ్రమల యజమానులు సహకరించాలని కోరారు. పరిశ్రమల యజమాన్యాల సహకారంతో జిల్లాలో 2025–26 ఏడాదికి సంబంధించి సీఎస్‌ఆర్ నిధుల వినియోగాన్ని మరింత ప్రణాళికాబద్ధంగా చేయాలని సూచించారు.
పెట్రోల్ బంకుల ఏర్పాటుకు చర్యలు:
లోకేశ్‌కుమార్
మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులను ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని రాష్ట్ర పంచాయతి రాజ్ కార్యదర్శి లోకేశ్‌కుమార్ అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ కేటాయించడం రాష్ట్రా నికి ఆదర్శంగా నిలిచిందని, అదేవిధంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూ సేకరణ చేపట్టాలని అధికారులకు ఆయన తెలిపారు. మహిళలు చేపట్టే పెట్రోల్ బంక్‌లలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం, క్యాంటీన్, చిన్న హోటల్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్‌డీఎ జ్యోతి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాజేశ్వర్, డీఈఓ తదితరులు పాల్గొన్నారు.


