జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్
జహీరాబాద్: ప్రకృతి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని దిడిగి గ్రామ శివారులో గల డీడీఎస్– కేవీకే ఆధ్వర్యంలో చిరుధాన్యాల సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. వ్యవసాయ శాఖ మద్ధతుతో అధిక దిగుబడులను ఇచ్చే విత్తనాల వినియోగం, శాసీ్త్రయ వ్యవసాయ విధానాల అనుసరణ ద్వారా రైతులు మరింత లాభదాయకంగా వ్యవసాయం చేయగలరని సూచించారు. కేవీకే ద్వారా రైతులకు శాసీ్త్రయ అవగాహన కల్పించడంపై ప్రశంసించారు. జహీరాబాద్ ప్రాంతంలో పప్పు ధాన్యాలు, నూనెగింజల సాగుపై మెరుగైన అవగాహన కల్పించడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహణ అధికారి రామచారి మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాల కోసం రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ పథకం కింద రెండు గేదెలు లేదా ఇతర వ్యాపారాలను ప్రారంభించేందుకు 90 శాతం సబ్సిడీ, 10 శాతం బ్యాంకు రుణం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ భిక్షపతి, కేవీకే శాస్త్రవేత్తలు వరప్రసాద్, రమేష్, శైలజ, స్నేహలత, కైలాష్, సాయి ప్రియాంక, రైతులు పాల్గొన్నారు.


