పెళ్లయిన రెండు నెలలకే..
భార్య అంటే ఇష్టం లేదని భర్త ఆత్మహత్య
వట్‌పల్లి(అందోల్): భార్య అంటే ఇష్టం లేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అందోలు మండల పరిధిలోని తాడ్మన్నూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. జోగిపేట ఎస్‌ఐ పాండు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్(24)కు సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామానికి చెందిన సంజీవులు కుమార్తె మాధవితో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. భార్య అంటే ఇష్టం లేని ప్రవీణ్ తరచు ఆమెతో గొడవపడేవాడు. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయి తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి వీరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


