బీఆర్‌ఎస్ గిరిజన నాయకుడి హత్య
కల్హేర్(నారాయణఖేడ్): మద్యం తాగిన మత్తులో జరిగిన గొడవలో బీఆర్‌ఎస్ గిరిజన నాయకుడిని హత్య చేశారు. ఈ ఘటన కల్హేర్ శివారులో నీలం వాగు వంతెన వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కల్హేర్ కొత్తచెరువు తండాకు చెందిన హరిసింగ్(56) స్థానిక మండల పరిషత్‌లో ఉపాధి హామీ పథకం కింద చెట్లకు నీరు పోసే పనులు చేస్తున్నాడు. ఇతడు చాలా రోజులుగా బీఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నాడు. అతడి భార్య పిప్లిబాయి ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆదివారం ఉదయం 8 గంటలకు తండా నుంచి కల్హేర్ వచ్చారు. రాత్రి హరిసింగ్ ఇంటికి వెళ్తున్న క్రమంలో పోమ్యానాయక్ తండాకు చెందిన గణపతి, సీతారాం అడ్డుకొని తనను చంపుతామని బెదిరిస్తున్నారని భార్య పిప్లిబాయికి ఫోన్ చేసి చెప్పాడు. మార్గమధ్యలో హరిసింగ్, సీతారాం, గణపతి ముగ్గురూ కలిసి మద్యం తాగారు. తాగిన మత్తులో గొడవ జరుగగా ఇద్దరూ కలిసి హరిసింగ్ మెడకు తువ్వాల చుట్టి హత్య చేశారు. మృతదేహం కనిపించకుండా ఉండేందుకు కల్వర్టులో చొరగొట్టే యత్నం చేశారు. రోడ్డుపై నుంచి ఎవరో వస్తున్నారనే భయంతో మృతదేహాన్ని వదిలేసి పారిపోయారు. మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు వెంకటేశం, వెంకట్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. తామే హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నట్లు సమాచారం. మృతుడు హరిసింగ్ భర్యా పిప్లిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెంకటేశం తెలిపారు.
మద్యం తాగిన మైకంలో గొడవ
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
కల్హేర్ శివారులో ఘటన


