ఆలయ భూములు కాపాడుకోవాలి
సీసీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి
కొమురవెల్లి(సిద్దిపేట) : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో అన్యాక్రాంతం అవుతున్న స్వామి వారి భూములను కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు సీపీఎం పార్టీతో కలిసి రావాలని సీసీఎం కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొమురవెల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 201, 208, 230లో 5 ఎకరాల 19 గుంటల భూమిని మహదేవుని మల్లయ్య, మహదేవుని సాంబయ్య 1983లో, సర్వే నంబర్ 218, 219లో 5 ఎకరాల 20 గుంటల భూమిని 1992లో మహదేవుని నాగమల్లయ్యతోపాటు మరో ఆరుగురు ఆలయానికి భూమిని విక్రయించారని తెలిపారు. ఆలయ భూములను కాపాడటంలో గతంలో ఆలయ ఈవోగా పని చేసిన బాలాజీ శర్మ నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఆలయ భూములను కాపాడేందుకు సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసినట్లు తెలిపారు. ఆలయ అధికారులు కోర్టుకు హజరు కాకుండా భూములు కొల్లగొట్టేందకు యత్నిస్తున్న వక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వివరించారు. ఆలయ భూములు కోల్పోయే విధంగా దేవాదాయ శాఖ అధికారులు కేసుకు హాజరు కాకుండా, వాదనలు వినిపించకుండా సదరు వ్యక్తులు కట్టడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి తాడూరి రవీందర్, జిల్లాకమిటీ సభ్యులు బద్దిపడిగే కృష్ణారెడ్డి, దాసరి ప్రశాంత్, తేలు ఇస్తారి, తాడూరి మల్లేశం, బక్కెల్లి బాల కిషన్, తదితరులు పాల్గొన్నారు.


