మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
● యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ పుష్పన్ కుమార్
● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన
నర్సాపూర్ రూరల్: యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ పుష్పన్ కుమార్ సూచించారు. గురువారం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమాయకంగా ఉండే యువతతోపాటు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని డ్రగ్స్ ముఠా టార్గెట్ చేసుకొని మత్తు పదార్థాలకు అలవాటు చేయడంతో పాటు డబ్బుల ఆశ చూపి వ్యాపారం చేయిస్తారని అన్నారు. తాత్కాలిక సంతోషాల కోసం పొరపాటు చేస్తే బంగారు భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టాన్సెస్ చట్టం 1985 చట్టం చాలా శక్తివంతమైందన్నారు. మత్తు పదార్థాలు సేవించినా, రవాణా చేసినా 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష ఉంటుందని సూచించారు. 13 రకాల డ్రగ్స్ ను గుర్తించే కిట్లు ప్రతీ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్, ప్రోగ్రామ్ అధికారి సురేశ్ కుమార్, అధ్యాపక బృందం రమేశ్, మహేందర్ రెడ్డి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.


