ధర పడిపోయి.. టమాటా చితికిపోయి
జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి గ్రామానికి చెందిన రాములు అనే రైతు రెండు ఎకరాల్లో టమాటా పంట వేశాడు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట ఆశాజనకంగా ఉంది. కానీ పంట చేతికందుతున్న సమయంలో ధరలు పడిపోవడంతో నష్టపోవాల్సి వస్తుంది.
ఝరాసంగం మండలంలోని కంబాలపల్లి గ్రామ రైతు తెనుగు శ్రీనివాస్ రెండు ఎకరాల్లో టమాటా పంట వేశాడు. సుమారు రూ. 60 వేలకు పైగా పెట్టబడి పెట్టాడు. ధరలు పతనం కావడంతో నష్టపోయాడు. కూలీ, రవాణా చార్జీలు కూడా రావడం లేదు. ఇలా జహీరాబాద్ నియోజకవర్గంలో టమాటా పంట పండిస్తున్న రైతుల పరిస్థితి ఉంది. వేల రూపాయల పెట్టుబడులు పెట్టినా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
● కిలో రూ.10 అయినా ఎవరూ కొనని పరిస్థితి
● పెట్టుబడులు కూడా రాక రైతుల ఆందోళన
● పొలాల్లో వదిలేస్తున్న పంట
జహీరాబాద్ టౌన్: జిల్లాలో సుమారు 560 ఎకరాల్లో టమాటా పంట ఉంటుంది. టమాటా నారు అందుబాటులో ఉండడం వల్ల సాగు విస్తీర్ణం పెరుగుతుంది. పడిపోయిన ధరల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. జహీరాబాద్ మార్కెట్‌కు లోకల్ టమాటాతోపాటు మహారాష్ట్ర నుంచి టమాటా వస్తుంది. డిమాండ్ కన్న దాదాపు రెట్టింపు రావడం వల్ల ధరలు పడిపోవడానికి కారణమవుతుంది. ఒక్కసారిగా పంట చేతికిరావడంతో ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం కిలో రూ.10 అయినా ఎవరూ కొనడానికి ముందుకు రావడంలేదు. కూలీలు, రవాణా ఛార్జీలు మీద పడుతున్నాయని కొంత మంది రైతులు పంటను పొలంలోనే వదిలేస్తున్నారు. దీంతో అప్పుల్లో కూరుకుపోతున్నారు.


