అర్హులందరికీ రేషన్‌కార్డులు
● వచ్చేనెల నుంచే ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ● మంత్రి దామోదర రాజనర్సింహ ● జోగిపేటలో సన్న బియ్యం పంపిణీకార్యక్రమం ప్రారంభం ● కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష
జోగిపేట(అందోల్)/సంగారెడ్డి జోన్: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. గురువారం జోగిపేట గంజి మైదానంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెకర్ వల్లూరు క్రాంతితో కలసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సన్నరకం బియ్యం పంపిణీ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతుల వద్ద సన్న బియ్యం క్వింటాలకు రూ.500 బోనస్ చెల్లించి సేకరించిందన్నారు. తాను గతంలో ఇచ్చిన హామీ మేరకు అందోలు, జోగిపేట ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. వచ్చే నెల నుంచే అర్హుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు.
పనులు వేగవంతం చేయాలి
సంగారెడ్డి మెడికల్ కళాశాల, విద్యార్థుల వసతి గృహం, అందోల్ నర్సింగ్ కళాశాలలోని హాస్టల్స్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. అందోల్‌ను మెడికల్ హబ్‌గా రూపొందించడంలో భాగంగా వట్‌పల్లి, కంకోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం పనులు వెంటనే పూర్తిచేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
కొమరయ్య ఆశయ సాధనకు కృషి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి దామోదర పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య 98వ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిలోని కొమరయ్య విగ్రహానికి మంత్రితోపాటు కలెక్టర్ వల్లూరు క్రాంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం విజయవంతం కోసం డీలర్లు పౌరసరఫరాల రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాస ప్రయాసలకోర్చి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి పౌరసరఫరాల శాఖ డీఎం రాజేశ్వర్ అంబదాస్, ఆర్డీవో పాండు, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మొహన్‌రెడ్డి, పాల్గొన్నారు.


