పలుచోట్ల అకాల వర్షాలు
రుద్రారంలో 4.9 సెం.మీలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో గురువారం పలు చోట్ల అకాల వర్షాలు కురిసాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు పంటలకు దెబ్బతిన్నాయి. జిల్లాలో పటాన్‌చెరు మండలం రుద్రారంలో అత్యధికంగా 4.9 సెం.మీల వర్షపాతం నమోదైంది. అలాగే పాశమైలారంలో 2.7 సెం.మీలు, గుమ్మడిదలలో 1.9 సెం.మీలు, చౌటకూర్‌లో 1.7 సెం.మీలు, సంగారెడ్డి 1 సెం.మీ వర్షపాతం రికార్డయింది. సదాశివపేట, మునిపల్లి మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ఇష్రితాబాద్‌లో పిడుగుపాటుకు 20 మేకలు చనిపోయాయి. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఎండల తీవ్రతకు ఇబ్బంది పడుతున్న జిల్లావాసులకు ఈ వర్షం కొంత ఊరట నిచ్చినట్లయింది.
ప్రసవాల సంఖ్య పెంచాలి
ఇమ్యూనైజషన్ అధికారి మనోహర్‌రెడ్డి
న్యాల్‌కల్(జహీరాబాద్): ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇమ్యూనైజషన్ అధికారి మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. న్యాల్‌కల్‌లోని పీహెచ్‌సీని గురువారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమంలో భాగంగా టీకాలు వేయించుకోని చిన్నారుల కోసం ఏప్రిల్, మే, జూన్ మాసాలలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డాక్టర్ అమృత్‌రాజ్, హెచ్‌ఏ గుండయ్య, సీహెచ్‌ఓలు మొగులయ్య, రవికుమార్‌లతోపాటు సుదర్శన్, మార్తా, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
పేస్కేల్ వర్తింపజేయాలి
రాష్ట్ర ప్రణాళిక చైర్మన్ చిన్నారెడ్డికి వినతి
జహీరాబాద్ టౌన్: ఉపాధి హామీ ఉద్యోగులకు పేస్కేల్ వర్తింప చేయాలని ఉపాధిహామీ పథకం జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక చైర్మన్ చిన్నారెడ్డికి వారు వినతిపత్రం అందజేశారు. జహీరాబాద్‌కు వచ్చిన ఆయనను కలిశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు అశోక్‌కుమార్, రాజ్‌కుమార్‌లు మాట్లాడుతూ...గ్రామీణాభివృద్ధి శాఖలో ఒక విభాగంలో పనిచేస్తున్న ఎఫ్‌టీఐ కాంట్రాక్టు ఉద్యోగులకు పేస్కేల్ అమలు కావడంలేదన్నారు. రాష్ట్రం మొత్తం 3,874 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, సెర్ప్ ఉద్యోగులకు ఇచ్చే విధంగా పేస్కేలు అమలు చేయాలని కోరారు. ఒకే కంప్యూటర్ ఆపరేటర్ల ఉన్న చోట మరొకరిని నియమించాలని, పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీ రూ.20 లక్షలు ఇవ్వాలని, సిబ్బంది మరణిస్తే రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, బేసిక్‌పై 12% పీఎఫ్ జమచేయాలని కోరారు.
సిరుల ‘బ్రహ్మోత్సవం’
నాచగిరికి రూ.16 లక్షల ఆదాయం
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహుని నవాహ్నిక బ్రహ్మోత్సవాలు కాసుల వర్షం కురిపించాయి. గత నెల 19 నుంచి పన్నెండు రోజులపాటు కొనసాగిన ఉత్సవాలలో ఆలయానికి రూ.16.13 లక్షల ఆదాయం సమకూరింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. దర్శనం, అభిషేకం, అర్చన, సేవా టికెట్లు తదితర సేవల ద్వారా మొత్తం రూ.16,13,328 ఆదాయం లభించినట్లు ఈఓ విశ్వనాథశర్మ పేర్కొన్నారు.
పలుచోట్ల అకాల వర్షాలు


