పాతాళానికి నీరు
● పడిపోతున్న భూగర్భ జలమట్టం ● ఫిబ్రవరితో పోల్చితే 2.22 మీటర్ల లోతుల్లోకి... ● మనూరులో ప్రమాద ఘంటికలు ● అత్యధికంగా తొమ్మిది మీటర్లుకిందికి పడిపోయిన మట్టం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : భూగర్భ జల మట్టం పడిపోతోంది. ఎండల తీవ్రతకు జిల్లాలో సగటున 2.5 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. విచ్చలవిడిగా నీటిని తోడేస్తుండటం కూడా ఈ నీటి మట్టం పడిపోవడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిబ్రవరిలో జిల్లా సగటు భూగర్భ జల మట్టం 12.57 మీటర్ల లోతులో ఉండగా, మార్చి మాసానికి వచ్చే సరికి నీటిమట్టం 14.79 మీటర్లలోతుకు పడిపోయింది. అంటే సగటున 2.22 లోతుకు దిగిపోయినట్లు భూగర్భ జలశాఖ అధికారులు గుర్తించారు. గతేడాది 2024 మార్చితో పోలిస్తే భూగర్భ జల మట్టం పరిస్థితి దారుణంగా ఉంది. 2024 మార్చిలో జిల్లా సగటు నీటి మట్టం 12.45 మీటర్ల లోతులో ఉండగా, ఈ మార్చి నెలాఖరుకి 14.79 మీటర్లు ఉన్నాయి. గతేడాది ఇదే మార్చి నెల కంటే ఈసారి మార్చిలో 2.34 మీటర్లు తగ్గిపోయాయి. భూగర్భ జల నీటి వినియోగం భారీగా పెరగడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు.
మనూరులో 9 మీటర్లలోతులోకి...
జిల్లాలో అత్యధికంగా మనూరు మండలంలో భూగర్భ నీటి మట్టం తగ్గిపోయింది. ఇక్కడ ఏకంగా 9.38 మీటర్ల లోతుకు పడిపోవడం ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. ఈ మండలంలో ఫిబ్రవరిలో 5.66 మీటర్ల లోతులో ఉన్న ఈ నీటిమట్టం ఇప్పుడు ఏకంగా 15.04 మీటర్లకు పడిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. నిజాంపేట్ మండలంలో 19.90 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం..మార్చి వచ్చేసరికి 24.73 మీటర్లకు దిగిపోయింది. కొండాపూర్ మండలంలో కూడా 4.17 మీటర్లు తగ్గాయి. ఈ మండలంలో 12.09 మీటర్ల నుంచి 16.26 మీటర్లకు పడిపోయాయి.
82 చోట్ల ఫీజో మీటర్లు
జిల్లావ్యాప్తంగా భూగర్భ జలమట్టాన్ని లెక్కించేందుకు మొత్తం 82 చోట్ల ఫీజో మీటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో నేషనల్ హైడ్రాలిక్ ప్రాజెక్టు ఆర్థిక సాయం కింద ఏర్పాటు చేసిన ఫీజో మీటర్లు 36 ఉన్నాయి. ఈ 36 ఫీజో మీటర్లు ఆటోమేటిక్‌వి కాగా, మిగిలినవి మ్యానువల్ ఫీజో మీటర్లు. భూగర్భ జలశాఖ అధికారులు ప్రతినెలా 15వ తేదీ నుంచి 28 తేదీ వరకు ఈ ఫీజో మీటర్లలో నీటి మట్టాలను కొలుస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందిస్తారు.
వర్షాల ప్రభావమే..
గతేడాది మార్చితో పోల్చితే ఈ మార్చిలో భూగర్భ జలాలు పడిపోవడానికి వర్షపాతమే ప్రధాన కారణమని భూగర్భ జలశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2021, 2022, 2023 సంవత్సరాల్లో వర్షాకాలంలో సుమారు 40% అధిక వర్షపాతం నమోదైంది. గత వర్షాకాలంలో అంత అధిక వర్షపాతం రికార్డు కాలేదు. కేవలం 20 లోపే అధిక వర్షపాతం నమోదైంది. ఈ కారణంగానే ఈ మార్చిలో భూగర్భ జలమట్టం పడిపోవడానికి ప్రధాన కారణమని ఆ శాఖ నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు భూగర్భ జల వినియోగం పెరగడం కూడా ఒకింత కారణమని అభిప్రాయపడుతున్నారు. అయితే ఏప్రిల్, మే మాసాలకు వచ్చేసరికి మరింత లోతుకు పడిపోయే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.


