కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తేనే...
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాసమస్యలను స్థానికులు అనేకసార్లు స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారు పట్టించుకున్న పాపానపోవడంలేదు. ఇక చేసేదేమీ లేక ఆ సమస్యలను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తున్నారు. వెంటనే తన దృష్టికి ప్రజలు తీసుకొచ్చిన సమస్యలపై కలెక్టర్ స్పందించడంతోపాటు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని అనేక సమస్యలు కలెక్టర్ పుణ్యమంటూ పరిష్కారమయ్యాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ దృష్టికి వచ్చిన సమస్యలపై స్థానిక అధికారులను వివరణ కోరడంతోపాటు వాటిని వెంటనే పరిష్కారించాలని ఆదేశిస్తుండటంతో స్థానిక అధికారులు ఆగమేఘాలమీద చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది తెల్లాపూర్ పరిధిలో జోరుగా నీటి దందా జరగడంతో దీనిని అరికట్టాలని స్థానికులు అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోకపోవటంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాత్రికి రాత్రే అధికారులు నీటి ట్యాంకర్లను సీజ్ చేశారు. తిరిగి కొద్ది రోజులుగా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో జోరుగా నీటి దందా మొదలైంది. దీనిని నియంత్రించాలని అధికారులను కోరినా వారు పట్టించుకోకపోవడంతో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకునిపోవడంతో అధికారులలో తిరిగి చలనం వచ్చింది. అక్రమ నిర్మాణాలపై సైతం అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో నేరుగా కలెక్టర్ దృష్టికే తీసుకునిపోతున్నారు.
లేదంటే ఎక్కడి గొంగళి అక్కడే...
సమస్యలను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్న స్థానికులు
తలలు పట్టుకుంటున్న అధికారులు


