తప్పిపోయిన బాలిక తల్లిదండ్రుల చెంతకు
జిన్నారం (పటాన్‌చెరు): అదృశ్యమైన బాలికను కనుగొని గంట వ్యవధిలోనే పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళ్తే.. గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన ఆకుల ప్రణవి (6) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. శనివారం పాఠశాలకు సెలవు రోజని మర్చిపోయి తల్లిదండ్రులు రోజు మాదిరిగానే బడికి పంపారు. ఈలోగా పాఠశాల లేదని తెలియడంతో తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లగా కూతురు ప్రణవి కనిపించలేదు. ఆందోళన చెందిన వారు పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై మహేశ్వర్ రెడ్డి నలుగురు సిబ్బందితో సుమారు గంట పాటు దోమడుగు గ్రామంలో వెతకగా ప్రణవి ఓ చోట ఆడుకుంటూ కనిపించింది. వెంటనే పాపను సంరక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.


