వన్యప్రాణుల దాహార్తి తీరేలా..
● అటవీ ప్రాంతంలో నీటి తొట్లు ఏర్పాటు ● 15 రోజులకు ఒకసారి నీటిని నింపుతున్న అధికారులు ● సీసీ కెమెరాలతో జంతువుల కదలికలు నమోదు ● దుబ్బాక రేంజ్ పరిధిలో 16,326 ఎకరాల అడవి విస్తీర్ణం
దుబ్బాకటౌన్: మండుతున్న ఎండలతో అడవుల్లో నీటి జాడ లేక వన్య ప్రాణులు అలమటిస్తున్నాయి. తాగు నీటి కోసం వణ్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వస్తున్న నేపథ్యంలో వాటి రక్షణకు దుబ్బాక అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆరు నెలలుగా వర్షాలు లేక అటవీ ప్రాంతంలోని నీటి జాలు గుంతలన్నీ వట్టి పోయాయి. దీంతో అడవి జంతువులకు తాగునీరు దొరకడం కష్టంగా మారింది. వాటి దాహాన్ని తీర్చేందుకు అటవీ ప్రాంతంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన నీటి తొట్లలో అటవీ శాఖ అధికారులు నీటిని నింపుతున్నారు. దుబ్బాక రేంజ్‌లోని ఫారెస్టులో 28 నీటి తొట్లు ఏర్పాటు చేశారు. 15 రోజులకు ఒక్కసారి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. ఆ నీటితోనే జంతువులు, పక్షులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి.
16,326 ఎకరాల అడవి
దుబ్బాక రేంజ్ పరిధిలో దుబ్బాక, మిరుదొడ్డి, అక్బర్‌పేట భూంపల్లి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, సిద్దిపేట రూరల్ పరిధితో కలుపుకొని 16,326 ఎకరాల అడవి విస్తీర్ణం ఉన్నట్లు అధికారు లు చెబుతున్నారు. అడవిలో దుప్పిలు, చిరుత పు లులు, ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు, అడవి పందులు, నక్కలు, అడవి గొర్రెలు, కుందేళ్లు ఇలా పలు రకాల జంతువులు సంచరిస్తున్నాయి.
కెమెరాలకు చిక్కిన జంతువుల ఫొటోలు
నీటి తోట్ల పరిసర ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలను సైతం అమర్చారు. నీరు తాగేందుకు వచ్చే పక్షులు, జంతువులు చిత్రాలు కెమెరాల్లో నమోదవుతున్నాయి. కెమెరాల నుంచి ఫొటోలను డంప్ చేసుకొని వాటి బాగోగులను, ఆరోగ్య పరిస్థితులను అంచనా వేస్తున్నారు.
జీవాల రక్షణకు చర్యలు
వేసవిలో అడవి జంతువుల దాహార్తిని తీర్చేందుకు సాసర్ పిట్లలో నీటిని నింపుతున్నాం. దుబ్బాక రేంజ్ పరిధిలో వేసవిలో అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
–సందీప్ కుమార్,
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, దుబ్బాక
వన్యప్రాణుల దాహార్తి తీరేలా..


