ఎంఆర్‌ఐ,సీటీ స్కాన్‌లను ఏర్పాటు చేయండి
ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి
ఆధ్వర్యంలో వినతి పత్రం
సంగారెడ్డి రూరల్: సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ యంత్రాలు ఏర్పాటుతో పాటు వైద్య సిబ్బందిని పెంచాలని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ కు ఫోరమ్ అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్రతో కలసి ఫోరమ్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ.. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ కి అనుబంధం కావడంతో సంగారెడ్డి ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రస్తుతం ఉన్న స్కానింగ్ యంత్రాలు, సిబ్బంది సేవలు, ఆసుపత్రికి వచ్చే రోగులకు సరిపోవడం లేదని వివరించారు.
13న లింగాయత్‌సమాజ్ సమావేశం
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలోని బసవ మండపంలో ఈ నెల 13న ఉదయం 11 గంటలకు తాలుకా స్థాయి లింగాయత్ సమాజ్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు తాలుకా లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు ఆనంద్ స్వరూప్ షెట్కార్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పట్టణంలోని బసవేశ్వర్ చౌక్‌లో సంఘసంస్కర్త బసవేశ్వరుడి నూతన విగ్రహం ఏర్పాటు కోసం సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


