మరో తహసీల్దార్‌పై చర్యలకు రంగం సిద్ధం
● రూ.40 కోట్ల భూమి విషయంలోజిమ్మిక్కులు! ● కొనసాగుతున్న అంతర్గత విచారణ ● ఇటీవల కొండాపూర్ తహసీల్దార్‌పై బదిలీ వేటు, ఆర్‌ఐ సస్పెన్షన్.. ● ముడుపుల కోసం అడ్డదారులుతొక్కుతున్న అధికారులు ● చర్చనీయాంశంగా తహసీల్దార్ల వ్యవహారాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కొందరు రెవెన్యూ అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముడుపులిస్తే చాలు తిమ్మిని బమ్మిని చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అడిగే వారే లేరన్నట్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ శాఖ ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కో ఎకరం భూమి రూ.కోట్లలో పలుకుతోంది. ఇది ఇలాంటి అక్రమార్కులకు వరంగా మారింది. నిబంధనల ప్రకారం పనిచేయాలన్నా ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. ఆయా భూమి మార్కెట్ విలువ ఎంతుంటుందో అదే స్థాయిలో వీరికి ముడుపులు ముట్టజెప్పాల్సిందే. ఇక నిబంధనలకు విరుద్ధంగా చేయాల్సిన పనులు వస్తే చాలు వీరి పంట పండుతోంది. రూ.లక్షల్లో ముడుపులు దండుకుంటున్నారు. ఒకటీ రెండు వ్యవహరాలు బెడిసికొట్టి బయటకు వస్తే...ఇలా బదిలీ వేటులు, సస్పెన్షన్‌లతో సరిపోతోంది. ఈ వ్యవహరం సద్దుమణిగాక తిరిగి పోస్టింగ్‌లు పొందుతుండటం రెవెన్యూశాఖలో పరిపాటిగా మారింది.
తహసీల్దార్ల బదిలీల్లోనూ ఇంతే..
ఇటీవల జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు జరిగిన విషయం విదితమే. తమకు అనుకూలమైన మండలాలు, భూముల ధరలు ఎక్కువగా ఉన్న మండలాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కువగా ఉన్నవి, ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న మండలాల్లో పోస్టింగ్‌ల కోసం కొందరు తహసీల్దార్లు పెద్ద ఎత్తున పైరవీలు చేసుకున్నారు. పట్టున్న మండలాలకు వెళితే నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చనే కారణంగా వీరు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇదిలా ఉండగా అయితే కొండాపూర్ మండలంలో జరిగిన పట్టా భూమి పౌతీ విషయంలో అధికారుల జిమ్మిక్కులు బయటకు రావడంతో సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టారు. ఇలా బయటకు రాకుండా లోలోపల జరిగిన అనేక భూ వ్యవహరాలపై షోకాజ్ నోటీసులు, మెమోలతో సరిపెడుతున్న వ్యవహరాలు అనేకం ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


