తల్లిని వేధిస్తున్నాడనే యువకుడి హత్య
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
జహీరాబాద్: తన తల్లిని తరచూ ఫోన్‌లో వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఇద్దరు నిందితులు యువకుడిని దారుణంగా హత్య చేశారు. మంగళవారం చిరాగ్‌పల్లి పోలీసు స్టేషన్‌లో హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి వెల్లడించారు. మొగుడంపల్లి మండలంలోని ధనాసిరి గ్రామానికి చెందిన అబ్బస్‌అలీ ఆటో నడుపుతూ జీవినం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఖలీషా అనే వ్యక్తి తల్లిని అబ్బాస్‌అలీ తరచూ బూతులు తిడుతుండేవాడు. ఫోన్ చేసి చేసి వేధించేవాడు. ఈ విషయమై ఖలీషా పలుమార్లు అబ్బాస్ ను హెచ్చరించాడు. అయినా వేధింపులు మానుకోలేదు. ఇదే విషయాన్ని ఖలీషా తన స్నేహితుడు మహతాకు చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి అబ్బాస్‌అలీని చంపాలనుకున్నారు. 6న అబ్బాస్‌అలీ గ్రామ శివారులోని ఓ ఫాంహౌస్‌లో ఉన్నాడని తెలిసింది. ఖలీషా, మహతాబ్‌లు మారణాయుధాలతో మోటారుసైకిల్‌పై వెళ్లి అబ్బాస్‌పై దాడి చేసి హత్య చేశారు. అడ్డుగా వచ్చిన అబ్బాస్ స్నేహితుడు షేక్ అబ్బాస్‌అలీ ముఖంపై బీర్ బాటిల్‌తో కొట్టి గాయపర్చారు. అనంతరం పారిపోతూ శేఖర్ అనే వ్యక్తిని దారిలో అడ్డగించి ఎయిర్ గన్, హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను చూపించి బెదిరించి మోటారు సైకిల్‌ను తీసుకొ పరారయ్యారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని ఫుగట్‌నగర్‌లో మహతాబ్ ఇంటి వద్ద నిందితులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ శివలింగం, ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు, తదితరులు పాల్గొన్నారు.


