
ఉద్యాన సాగులో బయోడిగ్రేడబుల్ ప్లాస్టికల్చర్
● గ్లోబల్ వార్మింగ్‌కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం ● ఉద్యానవర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి ● బ్లెండ్ కలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో యూనివర్సిటీ ఒప్పందం
ములుగు(గజ్వేల్): ఉద్యాన వ్యవసాయ పంటల సాగులో పర్యావరణ అనుకూల బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ ప్లాస్టిక్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ఉద్యానవర్సిటీ సంకల్పించిందని ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు ములుగు ఉద్యానవర్శిటీలో బుదవారం బ్లెండ్ కలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాస్టికల్చర్‌తో అభివృద్ధి, శిక్షణ సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో ప్లాస్టిక్ వాడకం గణనీయంగా పెరిగిందన్నారు. ఇవి భూమిలో క్షీణిస్తున్నప్పుడు మీథేన్, ఇథలీన్ వాయువులను విడుదల చేసి గ్లోబల్ వార్మింగ్‌ను మరింత పెంచుతుందన్నారు.ప్లాస్టిక్ కాలుష్యం నేలను నిస్సారం చేసి పంట దిగుబడిని తగ్గిస్తుందన్నారు. కలుపు మొక్కల అణచివేత, తేమ నిలుపుదల కోసం సాంప్రదాయ ప్లాస్టిక్ మల్చ్ ఫిల్మ్‌లు వాడకుండా బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ ప్లాస్టిక్‌లు రైతులు వినియోగించేలా మార్పు తేవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమన్నారు. ఇవి సులభంగా నేలలో కరిగిపోయి పర్యావరణ హానిని తగ్గించడంతో పాటు నేలను సుసంపన్నం చేస్తాయని వివరించారు. కార్యక్రమంలో ములుగు ఉద్యానవర్సిటీ, బ్లెండ్ కలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాస్టికల్చర్ అధికారులు భగవాన్, శుభం రతి, చీనానాయక్, లక్ష్మీ నారాయణ, సురేశ్ కుమార్, రాజశేఖర్, శ్రీనివాసన్, వీణజోషి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.