సుస్థిరాభివృద్ధిలో మన పల్లెలు | - | Sakshi
Sakshi News home page

సుస్థిరాభివృద్ధిలో మన పల్లెలు

Apr 10 2025 7:15 AM | Updated on Apr 10 2025 7:15 AM

సుస్థ

సుస్థిరాభివృద్ధిలో మన పల్లెలు

ప్రగతి ఆధారంగా పంచాయతీరాజ్‌ మార్కులు
● ఉమ్మడి జిల్లాలో బీ గ్రేడ్‌లో 24,సీ గ్రేడ్‌లో 1,419, డీ గ్రేడ్‌లో 171 జీపీలు ● ఏ పంచాయతీకి దక్కనిఅచీవర్స్‌ హోదా

సాక్షి, సిద్దిపేట: పేదరిక నిర్మూలన, జీవనోపాధి పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన వంటి తొమ్మిది అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచి మెతుకుసీమలోని 24 పల్లెలు పురోగతిలో ఫ్రంట్‌రన్నర్‌గా నిలిచాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022–23 నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా మార్కుల జాబితాలను కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఇటీవల ప్రకటించింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు గణనీయమైన మార్కులు సాధించాయి.

తొమ్మిది అంశాల ఆధారంగా...

కేంద్రప్రభుత్వం పంచాయతీ ముందస్తు సూచి(అడ్వాన్స్‌మెంట్‌ ఇండెక్స్‌) పేరుతో ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 1,615 గ్రామ పంచాయతీలు దరఖాస్తు చేశాయి. పేదరిక నిర్మూలన, పంచాయతీలలో జీవనోపాధి పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక వసతుల కల్పన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళల స్వావలంబనకు అనుకూలమైన విధానాలు అనే అంశాల ఆధారంగా గ్రామ పంచాయతీలకు దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం మార్కులను కేటాయించింది. ఇందులో 24 పంచాయతీలు ఫ్రంట్‌రన్నర్‌గా నిలవడం విశేషం. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏ పంచాయతీకీ అచీవర్స్‌ హోదా దక్కలేదు. ప్రస్తుతం గౌరవెల్లి ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన గ్రామం గుడాటిపల్లి 39.39 మార్కులతో ‘ఈ’గ్రేడ్‌లో నిలిచింది. అలాగే బీ గ్రేడ్‌లో నిలిచిన పటేల్‌గూడ, సుల్తానాపూర్‌ గ్రామాలు అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.

మెదక్‌ జిల్లా నార్సింగి మండలంలోని వల్లూరు గ్రామం తొమ్మిది అంశాలలో ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణతోపాటు వైకుంఠథామం, డంపింగ్‌యార్డు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, తాగునీటి సరఫరాను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దీంతో 77.90మార్కులు సాధించింది. దీంతో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి గ్రామం అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో 939 గృహాలుండగా 3,184 జనాభా ఉన్నారు. 2009–10లో నిర్మల్‌ పురస్కారం, 2021లో పారిశుద్ధ్య నిర్వహణలో దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జాతీయ అవార్డు వచ్చింది. గ్రామ పంచాయతీ భవనంపై సోలార్‌ను ఏర్పాటు చేసి సౌరవిద్యుత్‌ను వినియోగిస్తున్నారు. మిట్టపల్లి గ్రామం 77.59 మార్కులు సాధించడంతో పంచాయతీ కార్యదర్శి విజయ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

ఏ గ్రేడ్‌లో నిలిచేందుకు కృషి

సిద్దిపేట అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. నిధులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, పచ్చదనం పెంపు ఇలా విభాగాల సమన్వయంతో ముందుకు సాగుతూ ఏ గ్రేడ్‌లో నిలిచేందుకు కృషి చేస్తాం.

– దేవకీ దేవి, డీపీఓ, సిద్దిపేట

సుస్థిరాభివృద్ధిలో మన పల్లెలు1
1/2

సుస్థిరాభివృద్ధిలో మన పల్లెలు

సుస్థిరాభివృద్ధిలో మన పల్లెలు2
2/2

సుస్థిరాభివృద్ధిలో మన పల్లెలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement