హామీ కోల్పోయిన ఉపాధి
జహీరాబాద్‌టౌన్: జహీరాబాద్ పట్టణానికి సమీపంలోని గ్రామాలను మున్సిపల్‌లో విలీనం చేయడంతో ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం బంద్ అయింది. కేంద్రం నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలి. పట్టణానికి సమీపంలో ఉన్న పస్తాపూర్, రంజోల్, అల్లీపూర్, చిన్నహైదరాబాద్, హోతి(కె) ఐదు పంచాయతీలను 2019 సంవత్సరంలో ప్రభుత్వం మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. అప్పటినుంచి ఆ యా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిలిచిపోయా యి. జాబ్ కార్డులున్న పథకానికి దూరమయ్యారు.
పూర్తిగా పల్లె వాతావరణం
జహీరాబాద్ మున్సిపల్‌లో విలీనమైన పస్తాపూర్, అల్లీపూర్, చిన్నహైదరాబాద్,రంజోల్,హోతి(కె) గ్రామాలు పూర్తిగా పల్లెవాతారణం నెలకొని ఉంది. ఆయా గ్రామాల్లో అధిక శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. 2019 సంవత్సరం వరకు ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు ఏడాదికి వందరోజులు ఉపాధి అవకాశాలు కల్పించారు. కుటుంబాలకు జాబ్ కార్డులు కూడా జారీ చేసి పనులు చూపించి కూలీ డబ్బులు ఇచ్చారు. మున్సిపల్‌లో విలీనం తర్వాత పనులు నిలిపివేయడంతో ఆయా గ్రామాల కూలీలంతా ఇతర పనులకు వెళ్తున్నారు.
మంత్రి సీతక్క ప్రకటనతో...
మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీకి ప్రత్యామ్నాయంగా మరో పథకం అమలు చేసేందుకు ఆలోచిస్తున్నట్లు ఇటీవల మంత్రి సీతక్క ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రకటనపై వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2019 సంవత్సరంలో విలీనమైన గ్రామాలను కొత్త పథకం కింద పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
ఐదు పంచాయతీల్లో 1,168 మంది కూలీలు
జహీరాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన ఐదు పంచాయతీల్లో 1,168 మంది కూలీలు ఉపాధి హామీ పథకానికి దూరంగా ఉన్నారు. రంజోల్ గ్రామంలో 1,464 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా 261 కుటుంబాల్లోని 392 మంది కూలీలు ఉన్నారు. అల్లీపూర్‌లో 678 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా 33 కుటుంబాల్లోని 44 మంది కూలీలు పనులకు వచ్చారు. పస్తాపూర్‌లో 762 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా 16 మంది కూలీలు, హోతి(కె) గ్రామంలో 833 కటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా 337 కుటుంబాల్లో 556 మంది కూలీలు పనులకు వచ్చారు. ఇప్పుడు వీరంతా ఉపాధి పనులకు దూరంగా ఉంటూ ఇతర పనులు చేసుకుంటున్నారు.
విలీన గ్రామాల్లో పనులు చేపట్టాలి
జహీరాబాద్ మున్సిపల్‌లో విలీనమైన ఐదు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలి. విలీన వల్ల గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉన్న కూలీలకు పనులు పనిలేకుండా పోయింది. ఎండాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా పలుమార్లు ఇదే విషయమై సంబంధిత అఽధికారుల దృష్టికి తీసుకొచ్చాం.
– బి.రాంచందర్,
వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు
మున్సిపల్ విలీన గ్రామాల్లోపనులు బంద్
1,168 కూలీలు పనికి దూరం
హామీ కోల్పోయిన ఉపాధి


