సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
జిల్లాలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోషణ పక్షం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలలో పోషకాహారలోపాన్ని గుర్తించి, నివారించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలకు పోషకాహార విలువలు, పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఈ నెల 8న ప్రారంభమైన ఈ అవగాహన కార్యక్రమాలు 22 వరకు కొనసాగనున్నాయి. సంగారెడ్డి జోన్:
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన వివరాలు
ప్రాజెక్టు పేరు గర్భిణులు బాలింతలు 0–5లోపు
చిన్నారులు
జోగిపేట 1,986 1,964 13,086
నారాయణఖేడ్ 1,332 1,269 16,690
పటాన్‌చెరు 1,693 1,375 21,707
సదాశివపేట 2,911 2959 16,455
జహీరాబాద్ 1,731 1,445 27,337
తల్లిపాల ఆవశ్యకతను వివరించేలా
ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శిశువు జన్మించి మొదటి 1000 రోజుల ప్రాముఖ్యతను వివరించడం, పౌష్టికాహారలోపం ఉన్న చిన్నారులను గుర్తించడం, అనుబంధ పోషకాహారం కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేయడం వంటివి చేస్తారు. ఇప్పటికే మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలకు బరువులు తీయటం, గర్భిణీల సంరక్షణపై భర్తలకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించడంతోపాటు రెండేళ్లకంటే తక్కువ వయసు ఉన్న పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన వంటివి పూర్తి చేశారు.
కార్యక్రమం నిర్వహణపై సమావేశం
పోషణ పక్షం కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలన్నారు.
జిల్లాలో 5 ప్రాజెక్టులు..
1,504 కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా ఐదు ప్రాజెక్టులు ఉండగా 154 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాలలో గర్భిణీలు 9,653 బాలింతలు 9,012, ఐదేళ్లలోపు చిన్నారులు 95,275 మంది ఉన్నారు. ఆయా కేంద్రాలలో పోషకాహారం కలిగిన ఆహార పదార్థాలు బాలామృతం, గుడ్లు, పాలు నిరంతరం పంపిణీ చేస్తుంటారు.
ఈనెల 8 నుంచి ప్రారంభమైన పోషణ పక్షం 22 వరకు అంగన్‌వాడీల్లో కార్యక్రమాలు పౌష్టికాహారంపై గర్భిణీలు,బాలింతలకు అవగాహన
పౌష్టికాహారంపై
అవగాహన కల్పిస్తాం
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు తీసుకునే పౌష్ఠికాహారంపై అవగాహన కల్పిస్తాం. ప్రతీ కేంద్రం పరిధిలో పోషకాహార లోపం, తక్కువ బరువుతో జననం, ఊబకాయలోపం ఉన్న వారిని గుర్తిస్తాం. వారి పర్యవేక్షణతోపాటు పోషకాహారాన్ని అందిస్తాం.
– లలితకుమారి,
జిల్లా సంక్షేమాధికారి, సంగారెడ్డి జిల్లా
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం


